– ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శికి టీజీజేఎల్‌ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ‘ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న నూతన అధ్యాపకులకు పెండింగ్‌లో ఉన్న మే వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ (టీజీజేఎల్‌ఏ-475) డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శికి ఆన్‌లైన్ ద్వారా వినతి పత్రాన్ని ఆ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వస్కుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ సోమవారం పంపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను మేలో క్రమబద్ధీకరించారని గుర్తు చేశారు. ఈ క్రమబద్ధీకరణ జరిగిన నూతన అధ్యాపకులకు ఆ నెల వేతనాలు ఇంతవరకు అందలేదని వివరించారు. సుమారు రెండు వేల మందికి పైగా టోకెన్ నెంబర్లు వచ్చి ఈ-కుబేర్‌లో పెండింగ్ చూపిస్తున్నాయని తెలిపారు. ఆర్థిక శాఖ కార్యదర్శి వెంటనే జోక్యం చేసుకుని ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న నూతన అధ్యాపకుల మే వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.