ఎండఏ45.9 డిగ్రీలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మొన్నటి వరకు వర్షాలతో కొంత చల్లగా ఉన్నవాతావరణంలో క్రమంగా మార్పులు మొదలయ్యాయి. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతూ పోతున్నాయి. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో ఆదివారం నాడు 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. వచ్చే నాలుగైదు రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు కాస్తా రెండు నుంచి మూడు డిగ్రీల మేర పెరిగే అవకాశముంది. ముఖ్యంగా మంచిర్యాల, ఆదిలాబాద్‌, కొమ్రంభీం అసిఫాబాద్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. భానుడు ఉదయం 10 గంటల నుంచే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని భయానక పరిస్థితిని కల్పిస్తున్నాడు. ఓవైపు తీవ్ర ఎండలు, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇండ్లల్లో ప్యాన్లు వేసినా వేడిగాలే వస్తుంది తప్ప ఉపశమనం లభించని పరిస్థితి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. మరోవైపు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి పెరుగుతున్న క్రమంలో వడగాల్పులు వీచే ప్రమాదం కూడా ఉంది. 45 డిగ్రీలు దాటిన ప్రాంతాలు రెడ్‌ హెచ్చరిక జాబితాలో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తతో ఉండాల్సిన అవసరముంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండేందుకుగానూ వీలైనంత మేరకు ఎక్కువగా(కనీసం నాలుగైదు లీటర్ల) నీళ్లు తాగాల్సిన అవసరముంది. వీలైనంత మేరకు ప్రయాణాలు ఉదయం, సాయంత్రం పూటనే ఉండేలా చూసుకోవాలి.
కొండాపూర్‌(మంచిర్యాల) 45.9 డిగ్రీలు
జన్నారం(మంచిర్యాల) 45.8 డిగ్రీలు
జైన (జగిత్యాల) 45.5 డిగ్రీలు
నీల్వాయి(మంచిర్యాల) 45.5 డిగ్రీలు
బీలంపల్లి(మంచిర్యాల) 45.4 డిగ్రీలు
కెరమెరి(కొమ్రం భీమ్‌ అసిఫాబాద్‌) 45.4 డిగ్రీలు
ముప్కాల్‌(నిజామాబాద్‌) 45.1 డిగ్రీలు
పజ్జూర్‌(నల్లగొండ) 45.1 డిగ్రీలు