ఆకాశం వైపు ఎదురుచూపు,

– నైరుతీ రుతుపవనాలు ఆలస్యం
– జూన్‌ 15 వచ్చినా చినుకు జాడలేదు
– ఖరీఫ్‌ ముందస్తు సాగు అసాధ్యమంటున్న రైతులు
– ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలు ఏవీ?
జూన్‌ రెండో వారంలో కూడా మండుతున్న ఎండల్ని చూస్తుంటే వానా కాలమా..? ఎండా కాలమా..? అనే సందేహం కలుగుతుంది. ముందస్తు ఖరీఫ్‌ కాదు కదా.. సాధారణ ఖరీఫ్‌ సీజన్‌ కూడా చేజారిపోతుందనే గుబులు అన్నదాతలు వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో అకాల వర్షాలు తప్ప సీజన్‌లో కురవాల్సిన వర్షాల జాడలేకపోయే సరికి రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. నైరుతి రుతుపవనాలు సకాలంలో వస్తున్నాయని ఆశపడ్డ రైతులకు నిరాశే ఎదురవుతోంది. వేసవి దుక్కులు దున్నేందుకైనా పదును ఉండే చిన్నపాటి వర్షంకూడా కురవకపాయే అంటూ దిగాలు చెందుతున్నారు. పత్తి విత్తనాలు విత్తుకునే సమయం చేజారిపోతుందని ఆందోళన చెందుతున్నార
చినుకు కోసం ఎదురుచూపు
చినుకు జాడ కోసం ఎదురు సూత్తున్నం. మబ్బుకాన రాట్లే. ఎండ లు మండుతున్నయి. కాలమైతదో కాదోనన్న గుబులు పట్టుకుంది. 20 ఎకరాల్లో పత్తి విత్తనాలు విత్తుకునేందుకు సిద్దం చేసిన. అప్పు చేసి విత్తనాలు, ఎరువులు తెచ్చిన. ఏం లాభం కాలం లేకపాయే. ఈ మాసాంతం లోనైనా వర్షం కురిస్తే సరె. లేదంటే పత్తి వేసినా దండగే. పెట్టుబడి ఎల్లదు. కాలమైతదని పొలంలో ఆశతో ఎదురు సూత్తున్నం. ఆ మేఘాల దయ.
భీమిని మాణిక్కప్ప, మేళసంఘం
ప్రత్యామ్నాయ ప్రణాళికలు
సకాలంలో అవసరం మేరకు వర్షాలు కురవకపోతే ప్రత్యామ్నాయ పంట సాగుకు సంబంధించిన ప్రణాళికలున్నాయి. కాంటింజెంట్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసి రైతులు అకాల పరిస్థితులకు అనుకూలమైన పంటలేయాలి. ఆగస్టు 15 వరకు కూడా వర్షాలు కురవకపోతే రెగ్యులర్‌గా వేసుకునే పంటలు కాకుండా తక్కువ కాలంలో చేతికొచ్చే రకాల్ని సాగు చేయాలి.
స్పందన, ఏరువాక శాస్త్రవేత్త
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ పంటల సాగు జాడే కనిపిస్తలేదు. మూడు జిల్లాల్లో కలిపి 18 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశముంది. సంగారెడ్డి జిల్లాలో 7.10 లక్షల ఎకరాలు సాగుకానుంది. ఇందులో పత్తి 3.50 లక్షల ఎకరాలు, వరి 1.40 లక్షల ఎకరాలు, మిగతావి ఇతర పంటలు సాగవుతాయి. మెదక్‌ జిల్లాలో 3.76 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవ్వనుండగా.. ఇందులో అత్యధికంగా వరి.. 3.10 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. సిద్దిపేట జిల్లాలో 8 లక్షల ఎకరాల్లో.. 3.20 లక్షల ఎకరాల్లో వరి, 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవ్వనుంది. చెరకు, కంది, పెసర, మొన్నజొన్న, జొన్న, మినుము, మక్కలు, ఆలు,ఉల్లిగడ్డ వంటి పంటలూ సాగవుతాయి.
జూన్‌ 15 దాటినా వర్షాల్లేవు
జూన్‌, జులైలో కురిసే వర్షాల ఆధారంగానే ఖరీఫ్‌ సీజన్‌ పంటల సాగు ఆధారపడి ఉంటుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 7.48 లక్షల ఎకరాల్లో సాగయ్యే పత్తి విత్తనాలు జూన్‌ మొదటి వారంలోనే విత్తుకోవాలి. కనీసం రెండో వారంలోనైనా విత్తనాలు విత్తకపోతే పంట ఆలస్యమై చీడపీడల పాలవుతుంది. అదే విధంగా బోరుబావులు, కాల్వ లు, చెరువుల కింద 8 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వనుంది. ఆరిద్ర కార్తిలోనే వరినార్లు పోసుకుంటారు. సన్న రకాలు ఆరు మాసాలకే పంట చేతికొస్తుంది. అందుకే ఖరీఫ్‌లో జూన్‌లోనే వరి నార్లు పోస్తారు. ఇప్పటి వరకు వర్షాలు పడక పోయే సరికి మేజర్‌ పంటలైన పత్తి, వరి సాగు ప్రశ్నార్ధకంగా మారింది. సంగారెడ్డి జిల్లాలో జూన్‌లో సాధారణ వర్షాపా తం 130.4 మిల్లీ మీటర్లు కాగా ఇప్పటి వరకు వర్షం జాడే కనిపించలేదు. గతేడాది జూన్‌లో 150.1 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం 130.6 మిల్లీ మీటర్లు కాగా ఇంత వరకు చినుకే పడలేదు. ఈ ఏడాది జూన్‌లో కనీస వర్షాపాతమైనా పడు తుందా లేదా అనే అనుమానం కలుగుతుంది. పరిస్థితులు ఇలానే కొనసాగితే ఇక జులైపై ఆధారపడాల్సి వస్తుంది. ఆ మాసంలోనూ వర్షాలు సరిపడ కురవకపోతే ఖరీఫ్‌ పంటల సాగు చేజారిపోయిన ట్లేనని రైతులు పేర్కొంటున్నారు.
చేజారిన ముందస్తు ఖరీఫ్‌
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ముందస్తు ఖరీఫ్‌కు వెళ్లాలని ప్రణాళికలు తయారు చేసింది. తక్కువ కాలంలో పంట చేతికొచ్చే వరి రకాల్ని సాగు చేయాలని ప్రతిపాదనలు చేసింది. యాసంగి సీజన్‌లో పంట చేతికొచ్చే దశలో అకాల వర్షాలు కురిసి ప్రతి ఏటా నష్టమేర్పడుతుంది. యాసంగిలో మార్చి వరకు కోతలు పూర్తయితే నూక శాతం తక్కువవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్‌ ను ముందుకు తీసుకెళ్లాలని బావించింది. ఇందు కోసం వ్యవసాయ శాఖ వానాకాలం, యాసంగిలో సాగు పద్దతిపై ఒక ప్రణాళికల తయారు చేసింది. వానాకాలంలో 140 రోజులు అంతకన్న ఎక్కువ సయమం గల దీర్ఘకాలిక రకాల సాగుకు మే 25 నుంచి జూన్‌ 5 లోగా నారు పోసుకోవాలని సూచించింది. 130-135 రోజుల వ్యవధి గల మధ్య కాలిక రకాల సాగుకు జూన్‌ 15 వరకు నార్లు పోసుకోవాలి. 120-125 రోజుల వ్యవధి గల స్వల్పకాలిక రకాల సాగుకు జూన్‌ 25 వరకు నార్లు పోయాలి. ఎలాంటి రకాలైనప్పటికీ వానాకాలంలో జులై చివరి నాటికే నాట్లు వేసుకోవాలి. ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రకాల సూచనలకు కూడా సమయం దాటిపోయింది. అంటే ఈ ఏడాది ఖరీఫ్‌ ముందుకు జరిగే అవకాశంలేదు. యాసంగిలోనూ పాత పద్దతిలోనే వరి సాగు చేయాల్సి ఉంటుంది.
పత్తి, వరి సాగుకు అదును దాటుతున్న వైనం
పత్తి, వరి సాగుకు అదును దాటుతోంది. జూన్‌ 5 వరకు వరి సాగుకు నార్లు పోయాలి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా వరి నార్లు పోయలేదు. బోర్ల కింద కొంత మంది రైతులు నారు కోసం వడ్లు చల్లారు. అవి మొలకలు రావట్లేదు. వర్షాలు పడకపోతే నాట్ల కోసం పొలం దున్నడం వీలుకాదు. ఇక పత్తి సాగు సీజన్‌ దాటిపోతుంది. జూన్‌ మొదటి వారంలోనే పత్తి విత్తనాలు విత్తుకోవాలి. ఇప్పటి వరకు దక్కులు దున్ని సిద్దం చేశారు. వర్షాలు పడకపోవడం తో ఇంత వరకు ఏ ఒక్క ఎకరంలో కూడా విత్తనాలు విత్త లేదు. జూన్‌ చివరి వరకు పత్తి విత్తనాలు వేయకపోతే ఆ పంట సాగు ప్రశ్నార్ధకమే అవుతుంది.

Spread the love