మేధా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ అద్భుతం

– కొండకల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ప్రారంభంలో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-శంకర్‌పల్లి
మేధా సర్వో డ్రైవ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థ తయారు చేస్తున్న రైల్వే కోచ్‌, రైల్వే బోగీలు రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం మహా అద్భుతమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామంలో వంద ఎకరాల్లో రూ.850 కోట్లతో ఏర్పాటుచేసిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని గురువారం ఆయన ప్రారంభించారు. రైల్వే కోచ్‌ విడిభాగాల తయారీ యూనిట్లను మేధా సంస్థ ప్రతినిధులు కశ్యపరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి, పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయశ్‌ రంజన్‌తదితరులతో కలిసి యూనిట్లను సీఎం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు.. 2017లో కోచ్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయగా తెలంగాణ ప్రభుత్వం కంపెనీకి 310 సర్వే నంబర్‌లో వంద ఎకరాల భూమిని అప్పగిస్తూ ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఈ కంపెనీ ఏర్పాటుతో సుమారు 2000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. ప్రపంచానికి అవసరమయ్యే రైల్వే విడిభాగాలు రూ.2500 కోట్లతో తయారుచేసే యూనిట్‌ మన వద్ద ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని తెలిపారు. రైల్వే కోచ్‌ తయారీ ఎగుమతులకు కేంద్రంగా ఇక్కడి ప్రాంతం నిలువనుందని చెప్పారు. తెలంగాణ బిడ్డలయిన సంస్థ ప్రతినిధులు కష్యపురెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఎంతో కష్టపడి దేశానికి, ప్రపంచానికి అవసరమైన ప్రాజెక్టును మ్యానుఫ్యాక్చరింగ్‌ పూర్తి చేసి తనతో ప్రారంబింపజేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ మంజుల, జిల్లా కలెక్టర్‌ హరీశ్‌, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్‌ రత్నం, శంకర్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సాత విజయలక్ష్మి ప్రవీణ్‌ కుమార్‌, ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్‌రెడ్డి, మేధా కంపెనీ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.