– మొబైల్ ఉన్న ప్రతిఒక్కరూ జర్నలిస్టే
– జాతీయ సెమినార్‌లో సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ స్టీవెన్సన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మీడియా రంగం రాజకీయ నేతలు, కార్పొరేట్లు, మాఫియా చేతుల్లోకి పోయిందని ఉస్మానియా యూనివర్సిటీ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ స్టీవెన్సన్ అన్నారు. కార్పొరేట్ల చేతుల్లోకి పోయిన తర్వాత మీడియా పరిస్థితి మారిపోయిందని, వార్తల కంటే యాడ్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. యాడ్స్ కోసం ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్లను నియమిస్తున్నారని గుర్తుచేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అంబేద్కర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ‘రోల్ ఆఫ్ మీడియా ఇన్ ఛేంజింగ్ సోషియో, పొలిటికల్, ఎకానమిక్, అండ్ టెక్నాలాజికల్ ఎన్వీరాన్‌మెంట్’ అంశంపై నిర్వహించిన జాతీయ సెమినార్‌లో ఆయన మాట్లాడారు. మీడియా రంగంలో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టేనని, సెకన్‌లో తమకు సంబంధించిన పోస్టులు, రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారని తెలిపారు. ప్రపంచం అస్థిరత, అనిశ్చితి, సంక్లిష్టత, అస్పష్టమైన పరిస్థితిల్లో ఉందని చెప్పారు. దేశ సామాజిక, ఆర్థిక, భవిష్యత్‌కు, దేశాభివృద్ధికి సాంకేతిక విద్య ఎంతో అవసరమని అన్నారు. ఏ సమాజంలోనైనా మేధోపరమైన విజ్ఞానాన్ని ప్రజలకు అందించడంలో మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. మీడియా రెండు వైపులు పదునైనా కత్తి లాంటిదని అన్నారు. రాజకీయ నినాదాలను, సంచలనాత్మక విషయాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో విద్యాపరమైన తాత్విక ఆలోచనలను రేకెత్తించగలదని వివరించారు. దీంతోపాటు ప్రతికూలమైన వాతావరణం, గందరగోళం, అనిశ్చితి, నిరాశలను కూడ మీడియా సృష్టించగలదని చెప్పారు. వాస్తవ పరిస్థితులను అంచనావేయడంతోపాటు సమాజంలోని లోపాలనూ ఎత్తిచూపగలదని అన్నారు. విజ్ఞానం, సాంకేతికత సమాజ శ్రేయస్సుకు, పురోగతికి దోహదం చేస్తున్నదని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉందని, సామాజిక, ఆర్థిక, రాజకీయ, అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తున్నదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ప్రధానమైనదని అన్నారు. ప్రజాస్వామ్య మనుగడ, అభివృద్ధి, సంరక్షణ, పారదర్శకపాలనకు పత్రికా స్వేచ్ఛ ముఖ్యమని అన్నారు. పత్రిక స్వేచ్ఛలో భారతదేశం 130స్థానంలో ఉందని గుర్తుచేశారు. రాజకీయ రంగంలోనూ అనేకమార్పులు వచ్చాయని తెలిపారు. ఒక పార్టీ గుర్తుతో గెలిచి మరొక పార్టీలో చేరుతున్నారని, ఇది సమాజానికి మంచిది కాదని అన్నారు. ఐటీ రంగంలో రాత్రికి రాత్రే కంపెనీలను ఎత్తేసినట్టు ప్రకటనలు వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విద్యాసంస్థల జాయింట్ సెక్రటరీ రమణ, ఎంబీఏ కాలేజ్ ప్రిన్సిపాల్ భవాని, ప్రొగ్రామ్ కన్వీనర్ గుంటి కృష్ణకుమార్, తురాగ్ ఫౌండేషన్ ప్రతినిధి శైలజ, సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.