– అసత్యాలు, కట్టు కథలతో మత విద్వేషాలకు ఆజ్యం
– ప్రభుత్వ నియంత్రణ పూజ్యం
న్యూఢిల్లీ : దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇటీవలి కాలంలో చెలరేగిన హింసాకాండ ప్రజాస్వామ్య వాదులను, శాంతి కాముకులను ఆందోళనకు గురిచేస్తోంది. మతాలు, జాతుల మధ్య చిచ్చుపెట్టి తద్వారా రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు కొన్ని శక్తులు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఈ తరుణంలో సంయమనం పాటించి, మత సామరస్యానికి కృషి చేయాల్సిన కార్పొరేట్ మీడియా సంస్థలు అగ్నికి ఆజ్యం పోస్తూ విద్వేషాలను మరింతగా రెచ్చగొడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం హర్యానాలో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న మేవాట్‌లో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ సంస్థలు నిర్వహించిన ప్రదర్శన ఘర్షణలకు దారి తీసిన విషయం తెలిసిందే. అంతకుముందు మణిపూర్‌లో కుకీలు, మైతీల మధ్య ప్రారంభమైన హింసాకాండ ఎన్నో అకృత్యాలకు, అఘాయిత్యాలకు, అమానవీయ ఘటనలకు దారి తీసింది. మణిపూర్ మంటలు ఇప్పటికీ చల్లారనే లేదు. ఆ దారుణాలపై దేశంలోనే కాదు… ప్రపంచ దేశాలలో సైతం నిరసన ధ్వనులు విన్పించాయి. ఇక ముంబయిలో కదులుతున్న రైలులో గత నెల 31న జరిగిన హత్య కూడా మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ ఘటనలో చేతన్ కుమార్ సింగ్ అనే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ తన అధికారిని కాల్చి చంపి, ఆ తర్వాత ముగ్గురు ముస్లిం ప్రయాణికులను కూడా పొట్టన పెట్టుకున్నాడు. ఆ సందర్భంగా కొన్ని అభ్యంతరమైన వ్యాఖ్యలు చేస్తూ వీడియోలో కన్పించాడు. ‘మీరు భారతదేశంలో నివసించాలంటే…ఓటు వేయాలంటే…ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, థాకరేకు మద్దతు ఇవ్వండి’ అని చెప్పుకొ చ్చాడు. పోలీసు దళంలో మతోన్మాదం ప్రబలితే ఎన్నో అనర్థాలు చోటుచే సుకుంటాయని జాతిపిత మహాత్మాగాంధీ మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఐదు రోజుల ముందు ఓ ప్రార్థనా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ అంచనాలు 76 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిజమవుతున్నాయి.
మీడియా బాధ్యతారాహిత్యం
బీహార్, మణిపూర్, మహారాష్ట్రలలో జరిగిన ఈ ఘటనలను పరిశీలిస్తే అవన్నీ మతపరమైన విద్వేషాలను వ్యాప్తి చేసేందుకు ఉద్దేశించినవేనని అర్థమవుతుంది. ఈ దారుణాలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలోనూ, ప్రధాన స్రవంతి మీడియాలోనూ ప్రసారమయ్యాయి. ముఖ్యంగా కొన్ని టెలివిజన్ ఛానల్స్ వీటిని పదే పదే ప్రసారం చేస్తూ ప్రజల్లో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టాయి. దీంతో మతోన్మాదులు చెలరేగి పోయి పలువురు అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు ఒడిగట్టారు. మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన వారు మైతీ మహిళపై లైంగిక దాడి చేశారంటూ వ్యాపించిన తప్పుడు వార్తతో ఆ రాష్ట్రం అట్టుడికిపోయింది. సభ్య సమాజం తలదించుకునేలా అమానుష ఘటనలు చోటుచేసుకున్నాయి. కుకీ యువతులను నగంగా ఊరేగించి ఆపై అత్యాచారం చేసిన ఉదంతం దేశాన్ని కుదిపేసింది. ప్రతీకార దాడులతో మణిపూర్‌లో భయానక వాతావరణం నెలకొంది. మీడియాలో వచ్చిన అవాస్తవాలనే నిజమని నమ్మి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి దారుణ కృత్యాలకు తెగబడుతున్నారు. ఒకసారి పరిస్థితి చేయి దాటితే దానిని తిరిగి దారికి తెచ్చుకోవడం ఎంత కష్టమో మణిపూర్ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. తటస్థులుగా ఉండాల్సిన ప్రభుత్వోద్యోగులు కూడా చీలిపోయి, ఒకరిపై ఒకరు ద్వేష భావాన్ని పెంచుకున్నారు.
ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించిన సుప్రీం
టెలివిజన్ ఛానల్స్‌లో వచ్చిన విద్వేషపూరిత ప్రసంగాలపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ హృషీకేశ్ రారుతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆ సందర్భంగా గత సంవత్సరం సెప్టెంబర్ 22న కీలక వ్యాఖ్యలు చేసింది. టీవీ ఛానల్స్ మత విద్వేషాలకు ఆజ్యం పోస్తుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకొని టీవీ ఛానల్స్‌లో వచ్చిన కథనాలు విధ్వంసానికి కారణమయ్యా యని తెలిపింది. ఇలాంటి ద్వేషపూరిత ప్రసంగాలను ప్రోత్సహిస్తుం టే దేశం ఎటుపోతుందని ప్రశ్నించారు. ఇలాంటి కథనాలు, ప్రసంగాలు టీవీ ఛానల్స్ టీఆర్‌పీ రేటింగులను, లాభాలను పెంచుతాయని అంటూ టెలివిజన్ కార్యక్రమాలను నియం త్రించేందుకు చట్టాన్ని రూపొందిం చాలని ప్రభుత్వానికి సూచించింది. చట్టాన్ని తీసుకొచ్చే వరకూ కొన్ని మార్గదర్శకాలు జారీ చేయాలని తెలిపింది.
జాతిపిత ఆవేదన
మీడియాలో అసత్యాలు, అర్థ సత్యాలు ప్రచారం కావడం ఇది మొదటిసారి కాదు. పత్రికలో వచ్చిన ఒక తప్పుడు వార్తను చదివి 1926 డిసెంబర్‌లో అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి స్వామి శ్రద్ధానంద్‌ను హత్య చేశాడు. దీనిపై గాంధీజీ స్పందిస్తూ రషీద్‌ను హత్యకు పురిగొల్పిన కారణాన్ని ప్రస్తావించారు. కొన్ని పత్రికలు, కొందరు పాత్రికేయులు అవాస్తవ సమాచారాన్ని మీడియా ద్వారా వ్యాపింపజేస్తున్నారని విమర్శించారు. అంతేకాదు… స్వామి శ్రద్ధానందకు నివాళి అర్పించేందుకు గౌహతిలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ విద్వేషాలను వ్యాపింపజేసే వార్తా పత్రికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. హిందూ పత్రికలు ముస్లింలను, ముస్లిం పత్రికలు హిందువులను ద్వేషిస్తూ కాలం గడుపతున్నాయని గాంధీజీ ఆవేదన వ్యక్తం చేశారు.