మెడికల్‌ మాఫియాను నియంత్రించాలి

– డాక్టర్లను ప్రలోభపెడుతూ ప్రోడక్ట్స్‌ ప్రమోట్‌ చేసుకుంటున్నారు
– అందుకే ధరల పెరుగుదల
– రిప్రజెంటేటివ్‌ల హక్కులు పరిరక్షించాలి : టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ సదస్సులో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలో ఫార్మస్యూటికల్‌ మెడికల్‌ మాఫియా అత్యంత బలమైనదనీ, దాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు కూడా వెనుకడుగు వేస్తున్నాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. డాక్టర్లకు ఖరీదైన బహుమతులు, విదేశీ ట్రిప్‌లు ఆఫర్‌ చేస్తూ, అడ్డతోవల్లో తమ ఉత్పత్తుల్ని ప్రమోట్‌ చేయించుకుంటున్నాయని విమర్శించారు. అదే సమయంలో అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ హక్కుల చట్టాల్ని కూడా అమలు చేయట్లేదనీ, దీన్ని ప్రశ్నిస్తూ భవిష్యత్‌లో ఐక్యఉద్యమాలు రావాలని ఆకాంక్షించారు. ఎఫ్‌ఎమ్‌ఆర్‌ఏఐ వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ (టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ) ఆధ్వర్యంలో శుక్రవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ఫార్మా మార్కెటింగ్‌ విధానాలు-మందుల ధరల పెంపు’ అంశంపై సదస్సు జరిగింది.
టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ అధ్యక్షులు సీహెచ్‌ భానుకిరణ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎఫ్‌ఎమ్‌ఆర్‌ఏఐ మాజీ ఉపాధ్యక్షులు ఏజీ రాజమోహన్‌, జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ కే సునీల్‌ కుమార్‌, టీఎమ్‌ఎస్‌ఆర్‌యూ ప్రధాన కార్యదర్శి ఐ రాజుభట్‌, జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ ఏ నాగేశ్వరరావు మాట్లాడారు. ఫార్మస్యూటికల్‌ కంపెనీల మాయాజాలంలో వైద్యులు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనీ, మందు బిళ్లల రూపాలు మార్చి, ఆ పేర్లతో ప్రమోషన్లు చేస్తున్నారని అన్నారు. మందులు ఏ వ్యాధికి ఎలా పనిచేస్తాయి…ఏఏ మాలిక్యులర్స్‌ దానిలో ఉన్నాయి…సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏవైనా వస్తాయా…అనే విషయాలను వదిలి, మందు బిళ్లల కలరు, షేప్స్‌, ప్యాకింగ్‌ వంటి అంశాలను ప్రమోషన్‌ చేస్తున్నాయని తెలిపారు. ఈ ప్రలోభాలకు లోబడిన కొందరు డాక్టర్ల వల్ల అందరికీ చెడ్డపేరు వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్యాస్యూటికల్‌ మెడికల్‌ మాఫియాను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని 26వేల ఫార్యస్యూటికల్‌ కంపెనీల్లో ఒక్క దానిలో కూడా కనీస వేతనాలు సహా ఎలాంటి చట్టాలు అమలు కావట్లేదని పలు ఉదాహరణలు వివరించారు. భవిష్యత్‌లో సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ హక్కుల కోసం మరిన్ని ఐక్య ఉద్యమాలు రావాలనీ, దానికోసం తమ సంఘాలు కృషి చేస్తాయని తెలిపారు.