మందుల దందా..!

– అడ్డగోలుగా అమ్మకాలు మెడికల్‌ షాపుల ఇష్టారాజ్యం
–  డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే విక్రయాలు
–  పట్టించుకోని ఔషధ నియంత్రణ అధికారులు..!
నవతెలంగాణ-సిటీబ్యూరో
మీకు తల తిరిగిపోతుందా..? జ్వరం వస్తోందా..? కడుపు నొప్పి, ఒళ్లు నొప్పులతో భరించలేకుండా ఉన్నారా..? నిద్ర పట్టడం లేదా..? వాంతులు, విరేచనాలు అవుతున్నాయా..? అయితే ఏం ఫర్వాలేదు. భయపడాల్సిన అవసరమూ లేదు. డాక్టర్లను కలిసి సమయం వెచ్చించాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం విషయం చెబితే చాలు..! మెడికల్‌ షాపుల్లో అన్ని రకాల మందులను ఇచ్చేస్తారు. ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతున్నాయి. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ అవసరమే లేదు. ఏ మందులు వేసుకోవాలో..! రోజుకు ఏయే సమయాల్లో ఎన్ని వేనుకోవాలో కూడా వారే చెప్పేస్తున్నారు..!.
హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో రిటైల్‌, హోల్‌సేల్‌ మెడికల్‌ షాపులు మొత్తం దాదాపు 10వేల వరకు ఉంటాయి. చిన్నా పెద్ద దుకాణాల్లో దాదాపు రూ.3 వేల నుంచి రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ప్రతి రోజూ దాదాపుగా రూ.10 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా. రెండు జిల్లాల్లోని చాలా మెడికల్‌ షాపులు డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే మందులు ఇస్తున్నాయి. అది ఉంటేనే మందులు ఇవ్వాలని నిబంధన ఉన్నా.. చాలా చోట్ల అమలు కావడం లేదు. సమస్యను చెబితే చాలు.. మందులు ఇచ్చేస్తున్నారు. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేయడం, నామమాత్రంగా కేసులు నమోదు చేసి, చేతులు దులిపేసుకోవడం తప్పితే ఈ దందాను శాశ్వతంగా అరికట్టలేకపోతున్నారు.
దగ్గినా.. తుమ్మినా.. అనుమానమే..
అసలే వర్షాకాలం.. తుమ్మినా.. దగ్గినా.. అనుమానమే. దీనికి తోడు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ లాంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం కూడా ఉంది. దీంతో చిన్నపాటి దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించినా హైదరాబాద్‌ జనం మెడికల్‌ షాపులకు పరుగులు పెడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొంత మంది దుకాణాదారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
రోగి లేదా కుటుంబీకులు మందులు కావాలి అంటే.. ఎలాంటి ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే మందులు ఇచ్చేస్తున్నారు. కార్డియాలజీ, సైక్రియాట్రి, న్యూరాలజీ, బ్రెయిన్‌ స్ట్రోక్‌, డయాబెటిక్‌, బీపీ, యూరిన్‌ -ఇన్ఫెక్షన్‌ వంటి మందులను డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేకుండా ఇవ్వకూడదు. ఇందులో హైడో స్‌, లో డోస్‌ ఉంటాయి. రోగ తీవ్రత, రోగి వయసును బట్టి డాక్టర్లు డోసులను నిర్ణయిస్తారు. ప్రిస్క్రిప్షన్‌పై డాక్టర్‌ ఎన్ని మందులు రాశారో.. ఆ మేరకే ఇవ్వాలి. రోగి మరోసారి అడిగితే కూడా ఇవ్వకూడదు. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు.
మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవారు కొన్ని రకాల సిరప్‌లు వాడుతున్నారు. కోరెక్స్‌, సెన్సిల్‌ వంటి ఔషధాలు కొంత మత్తు కలిగిస్తాయి. మాదకద్రవ్యాలు దొరకని సమయంలో వాటికి బానిసైనవారు ఈ సిరప్‌లు వినియోగిస్తూ ఉంటారు. ఈ తరహా సిరప్‌లను డాక్టర్‌ రాసిస్తేనే రోగికి ఇవ్వాలి. కానీ హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని కొన్ని మెడికల్‌ షాపుల్లో ఎవరు ఎన్ని అడిగితే అన్ని ఇచ్చేస్తున్నారు. నిషేధిత డ్రగ్స్‌, కాల పరిమితి దాటినా, నకిలీ మందులను సైతం యథేచ్చగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. డాక్టర్‌ రాసిన ఔషధాలు లేకుంటే మెడికల్‌ షాపుల్లో వాటికి బదులుగా మరో కంపెనీ మందులను అంటగడుతున్నారు.
డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ తప్పనిసరి
ఆకుల సంజరురెడ్డి, ఫార్మకాలజిస్ట్‌ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఫార్మా సొసైటీ
డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేనిదే మెడికల్‌ షాపుల్లో మందులను విక్రయించరాదు. ఒక వేళ విక్రయిస్తే డ్రగ్స్‌ అండ్‌ కాస్మోటిక్‌ యాక్ట్‌ 1940, రూల్స్‌ 1945 ప్రకారం చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌, హెచ్‌1, షెడ్యూల్డ్‌ ఎక్స్‌ డ్రగ్స్‌ను అమ్మరాదు. రూల్స్‌ పాటించని మెడికల్‌ షాపులపై ఔషధ నియంత్రణ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.