మెగా డీఎస్సీని ప్రకటించాలి

– 13,086 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి
– టీజేఎస్‌ అధినేత కోదండరామ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో హామీ ఇచ్చినట్టుగా 13,086 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని టీజేఎస్‌ అధినేత కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. 5,089 ఉపాధ్యాయ కొలువులకు నోటిఫికేషన్‌ ఇవ్వడం సరైంది కాదనీ, మెగా డీఎస్సీని ప్రకటించాలని కోరారు. శనివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో డీఎస్సీ అభ్యర్థుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం ఇచ్చిన మాటను అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. 13,086 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ అభ్యర్థులు ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాయాలని కోరారు. కోచింగ్‌ కేంద్రాల్లో సంతకాల సేకరణను చేపట్టాలని సూచించారు. 5,089 ఉపాధ్యాయ కొలువుల భర్తీ అభ్యర్థులు అసంతృప్తిగా ఉన్న విషయాన్ని నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అందుకు నిదర్శనమని అన్నారు. రాతపరీక్షలను నిర్వహించాలి కానీ ఉద్యోగాలు ఇవ్వొద్దన్న ధోరణితో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. ఓట్ల మీద ఉన్న ధ్యాస ఉద్యోగాల భర్తీపై ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. విద్యారంగం, కొలువుల భర్తీ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాల్లో లేవని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందనీ, పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు నీల వెంకటేశ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌, పీడీఎస్‌యూ నాయకులు నాగేశ్వరరావు, బీఎస్పీ నగర అధికార ప్రతినిధి అరుణ, ఓయూ జేఏసీ నాయకులు మహేష్‌, ఉదరుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.