– వరుసగా మూడో వారంలోనూ తగ్గుదల
– నాలుగు నెలల కనిష్టానికి పతనం : ఆర్బీఐ వెల్లడి
ముంబయి : భారత విదేశీ మారకం నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. వరుసగా మూడో వారంలోనూ పడిపో యాయి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. సెప్టెంబర్22తో ముగిసిన వారంలో ఏకంగా 2.3 బిలియన్ డాలర్లు కరిగిపోయి 590.70 బిలియన్లకు పరిమితమయ్యాయి. ఇంతక్రితం రెండు వారాల్లో 5.9 బిలియన్ల నిల్వలు క్షీణించాయి. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు ఆర్బీఐ డాలర్లను విక్రయించడంతో నిల్వలు తగ్గుతున్నాయని ఫారెక్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021 అక్టోబర్‌లో భారత విదేశీ మారకం నిల్వలు 645 బిలియన్ డాలర్లకు చేరి ఆల్‌టైం గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. ఆ తర్వాత నుంచి హెచ్చు.. తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పెరుగుదల, భారత స్టాక్ మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గడం.. ఎఫ్‌ఐఐలు తరలిపోవడం తదితర అంశాలు మారకం నిల్వలపై ఒత్తిడి పెంచుతోందని బీఎన్‌పీ పరిబాస్ బై షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరీ పేర్కొన్నారు. దేశ ఎగుమతులు క్షీణించడం, దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు ఎగిసిపడి.. తద్వారా కరెంట్ ఎకౌంట్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో చెల్లింపులు భారం పెరుగుతోంది. ప్రస్తుత ఏడాది జూన్ చివరి నాటికి విదేశీ రుణాలు దాదాపు రూ.52 లక్షల కోట్లకు చేరడం.. వాటికి సంబంధించిన అప్పులు, వడ్డీలు డాలర్ల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 2023 జూన్ త్రైమాసికంలో భారత సరుకుల వాణిజ్య లోటు 55.6 బిలియన్లకు పెరిగింది. ఇంతక్రితం ఏప్రిల్‌లో త్రైమాసికంలో ఇది 52.6 బిలియన్లుగా చోటు చేసుకుంది. మరోవైపు విదేశాల్లోని భారతీయుల రెమిటెన్స్‌లు 28.6 బిలియన్ల నుంచి 27.1 బిలియన్లకు తగ్గాయి. ఈ పరిణామాలన్నీ భారత విదేశీ మారకం నిల్వలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.