– 3,989 కేంద్రాలు అప్‌గ్రేడ్
– టీచర్లకు ఉద్యోగ్య విరమణ సమయంలో లక్ష రూపాయల సహాయం
– హెల్పర్లకు రూ.50 వేలు
– పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం
– సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగ విరమణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు లక్ష రూపాయలు, హెల్పర్లకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించింది. 50 ఏండ్ల లోపు వారికి రూ.2 లక్షల ఇన్సూరెన్స్, 50 ఏండ్లకు పైబడిన వారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఇవ్వనున్నట్టు తెలిపింది. దురదృష్టవశాత్తు విధుల్లో ఉన్న టీచర్లు మరణిస్తే తక్షణ సహాయం కింద రూ.20 వేలు, హెల్పర్లు మరణిస్తే రూ.10 వేలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవోలు, ఉత్తర్వులు జారీ చేస్తూ అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు తీపికబురు అందించింది. అదే సమయంలో అంగన్వాడీ టీచర్లు, వర్కర్లకు రిటైర్మెంట్ వయసు 65 ఏండ్లకు పెంచింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 30 నాటికి 65 ఏండ్ల రిటైర్మెంట్ వయస్సును నిర్దేశించింది. అంగన్వాడీ టీచర్లు, వర్కర్లకు పదవీ విరమణ తర్వాత ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీలపై పనిభారం తగ్గించేందుకుగా యాప్‌ను సరళతరం చేస్తామని హామీనిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న డిమాండ్లను నెరవేర్చామని ప్రకటించింది. ఈ జీవోల అమలుతో ప్రభుత్వంపై రూ.115 కోట్ల భారం పడనున్నట్టు తెలిపింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అంగన్వాడీలకు పెద్ద పీట వేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇప్పటికే అంగన్వాడీలకు మూడుసార్లు వేతనాలు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10 శాతం ఉండేదన్నారు. మోడీ సర్కారు తన వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచి కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నదని విమర్శించారు. రాష్ట్రంలో పెరిగిన వేతనాల ప్రకారం కేంద్ర వాటా 60 శాతం ఉండాల్సి ఉండగా.. అంగన్వాడీ టీచర్ల వేతనాల్లో 19 శాతం, హెల్పర్ల వేతనాల్లో 17 శాతం మాత్రమే ఇస్తున్నదని తెలిపారు. రాష్ట్రం వాటా కింద వేతనాల్లో 40 శాతం ఇవ్వాల్సి ఉండగా.. టీచర్ల వేతనాల్లో 80 శాతం, హెల్పర్ల వేతనాల్లో 82 శాతం ఉండటం సీఎం కేసీఆర్ ఔదార్యానికి, అంగన్‌వాడీలపై ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు.