– మత్స్యకారులతో చేపలు పట్టి అబ్చురపర్చిన వైనం
నవతెలంగాణ-పెద్దవంగర
నిత్యం జనంతో మమేకమయ్యే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మృగశిర కార్తె వేళ జాలరీగా మారారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గురువారం ‘ఊరూరా చెరువు’ పండుగా సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. అందులో భాగంగా మరిపెడ మండలంలోని గంట్లకుంట గ్రామంలో మత్స్యకారులు చేపలు పట్టడం మంత్రి కంటపడింది. వెంటనే కాన్వారు ఆపిన మంత్రి, జాలర్లతో కలిసి చెరువులోకి దిగారు. వల పట్టి, చేపలు పడుతూ సంబరపడ్డారు. అనంతరం వారితో ముచ్చటించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల ఆదాయం మార్గంపై ఆరా తీశారు. సీఎం కేసీఆర్ చొరవతోనే తెలంగాణకు పూర్వవైభవం వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.