– సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెండ్యాల బ్రహ్మయ్య
– 14వ రోజుకు చేరిన నిరవధిక సమ్మె
– యాచారంలో మంత్రి సత్యవతి రాథోడ్ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-యాచారం
దేశంలో ఏ రాష్ట్రంలో లేని వేతనాలు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెండ్యాల బ్రహ్మయ్య అన్నారు. ఆదివారం యాచారం మండల కేంద్రంలో అంగన్ వాడీలు మంత్రి సత్యవతి రాథోడ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అంగన్‌వాడీలు చేస్తున్న నిరావధిక సమ్మె14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల కోసం అంగన్‌వాడీ ఉద్యోగస్తులు చేస్తున్న ఉద్యమంపై ఐసీడీఎస్ మంత్రి సత్యవతి రాథోడ్ తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. అంగన్ వాడీలు వేతనాలు సరిపోక అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న బెనిఫిట్స్ తెలంగాణలో కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ చందు నాయక్, అంగన్‌వాడీలు, ఆయాలు అండాలు, యాదమ్మ, ప్రేమలత, విజయలక్ష్మి, పద్మ, సుల్తాన, తదితరులు పాల్గొన్నారు.