బీజేపీ ఎంపీ ఇంట్లో మైనర్‌ మృతదేహం

– బాలుడి మృతిపై సర్వత్రా అనుమానాలు
అసోం: అసోంలోని అధికార బీజేపీ ఎంపీ ఇంట్లో దారుణం చోటుచేసుకున్నది. సిల్చార్‌ ఎంపీ రాజ్‌దీప్‌ రారు నివాసంలో అనుమానాస్పద స్థితిలో పదేండ్ల బాలుడి మృతదేహం లభించింది. అతని మెడచుట్టూ బట్ట చుట్టి ఉన్నది. మృతుని తల్లి ఎంపీ ఇంట్లో గత రెండున్నరేండ్లుగా డొమెస్టిక్‌ హెల్పర్‌గా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తన ఇంట్లో బాలుడి మృతదేహం వేలాడి ఉన్న స్థితిలో కనిపించిందని ఎంపీ రాజ్‌దీప్‌ చెప్పారు. వెంటనే అతడిని హుటాహుటిన దవాఖానాకు తరలించామని, అయితే అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారని వెల్లడించారు. బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడని తెలిపారు. అయితే ఇది హత్యా, ఆత్మహత్యా అని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.