– మండల సభ్యుల ఆందోళన
నవతెలంగాణ- తాడ్వాయి
మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో అల్లాడిపోతున్నామని సర్పంచులు,ఎంపీటీసీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ కౌడి రవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లోని ట్యాంకులోకి మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథను ప్రారంభించిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామాలకు సక్రమంగా నీళ్లు సరఫరా కావడంలేదని మండిపడ్డారు. కొన్ని గ్రామాల్లో నీళ్లు వచ్చిన నీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందన్నారు.బ్రాహ్మణపల్లి గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా లేదని ఎంపీటీసీ వెంకట్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు. మిషన్ భగీరథ ఏఈలు వినోద్ ,బాలకృష్ణలు గ్రామాలకు రావడంలేదని నేటి సరఫరాను పట్టించుకోవడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథకు ఇద్దరు ఏ ఈ లు ఉన్నా ఒక్కరు గ్రామాలకు రావడంలేదన్నారు.ఎన్నిసార్లు చెప్పినా కరెంటు సమస్యలు పరిష్కరించడం లేదని కరడ్పల్లి సర్పంచ్ బాలచంద్రం, దేమికలాన్ సర్పంచ్ పవురాజ్, ఎర్ర పహాడ్ ఎంపీటీసీ జలంధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు సమస్యలు చాలా ఉన్నాయని ఇన్చార్జి ఏఈ భాస్కర్ పై మండిపడ్డారు. చిట్యాల్లో తీవ్రమైన కరెంట్ సమస్య నెలకొందని గ్రామ సర్పంచ్ మ్యాడం కవితా బాలయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఎర్ర పహాడ్ లో అసలు వైద్యాధికారి పనిచేస్తున్నారా లేరా వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని సర్పంచులు, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యాధికారి సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు మండలంలో అధికారులు సక్రమంగా పనిచేయకపోవడంతో సమస్యలు తీవ్రమవుతున్నాయని సర్పంచులు మండిపడ్డారు. ఇకనైనా సమస్యలు పరిష్కరించడంలో చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కౌడి రవి, జెడ్పిటిసి రమాదేవి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పులగం సాయి రెడ్డి, డిసిఎంఎస్ డైరెక్టర్ నల్లవెల్లి కపిల్ రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సింలు ,ఎంపీడీవో రాజ్వీర్, తహసిల్దార్ సునీత తదితరులు పాల్గొన్నారు