ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ వ్యాఖ్యలు దుర్మార్గం..

– దళిత అడ్వకేట్‌పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి : కేవీపీఎస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ ఎంఆర్‌పీఎస్‌ కొడుకులంటూ పరుష పదజాలాన్ని ప్రయోగించటం దుర్మార్గమంటూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌ వెస్లీ, టి స్కైలాబ్‌బాబు గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. దళితబంధు అవినీతి పై ప్రశ్నించినందుకు దళిత న్యాయవాది యుగేందర్‌పై ఎమ్మెల్యే అనుచరులు భౌతిక దాడికి పాల్పడటం సమంజసం కాదని తెలిపారు. దళిత బంధులో అవినీతి జరిగిన దానిని స్వయానా సీఎం కేసీఆర్‌ అంగీకరించారని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా తన చేతిలో ఉందని ప్రకటించారని గుర్తు చేశారు. అదే విషయాన్ని ప్రస్తావించిన దళిత న్యాయవాధీపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడడం శోచనీయమని తెలిపారు. దళితబంధు రాజకీయలకతీతంగా అర్హులైన దళితులందరికి ఇవ్వాలనే న్యాయమైన డిమాండ్‌ ప్రకారం అందరికి ఇవ్వాలని కోరారు. దళిత ఎమ్మెల్యేగా ఉండి దళితులపై పరుష పదజాలం వాడడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న న్యాయవాదికి మెరుగైన వైద్యం అందించాలనీ, దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌ తుంగతుర్తి నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్యను సష్టించడం సరికాదని పేర్కొన్నారు. ప్రశ్నిస్తున్న నాయకుల మీద, జర్నలిస్టుల మీద, మేధావుల మీద దాడులు శోచనీయమని తెలిపారు.