ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలి..

– సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
నిలువ నీడలేని నిరుపేదలు గుడిసెలు వేసుకున్న స్థలాన్ని రెడ్డి కమ్యూనిటీ హలుకు రాసి ఇచ్చిన సూర్యాపేట శాసనసభ్యులు మాజీమంత్రి జగదీశ్వర్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ డిమాండ్ చేశారు.బుదవారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్  భవన్ లో పార్టీ నిర్వహించిన సమావేశంలో ఆయన  మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి  సూర్యాపేట జిల్లా చివ్వేముల మండలం కుడకుడ శివారు ప్రాంతం సర్వేనెంబర్ 126 ప్రభుత్వ భూమిలో పేదలు గత ఐదు సంవత్సరాల నుండి అనేకమార్లు గుడిసెలు వేసి, అప్పటి మంత్రి జగదీష్ రెడ్డికి, కలెక్టర్ కి అనేకసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అన్నారు. 2022 అక్టోబర్లో పేదలు గుడిసెలు వేస్తే అప్పటి అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్ ఎంక్వయిరీ పెట్టి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచరులు కొంతమంది వామపక్ష నాయకులు కలిసి పేదలు వేసిన గుడిసెల మీదికి పంపించి గొడవలు సృష్టించి మా కార్యకర్తల పైన, నాయకుల పైన దాడులు చేయించారు అన్నారు. పేదలకు అన్యాయం చేసిన జగదీశ్ రెడ్డి తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. లేనియెడల పార్టీ ఆధ్వర్యంలో తను రాజీనామా చేసేంతవరకు ఎమ్మెల్యే కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ పెద్ద ఎత్తున పోరాటలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పేద ప్రజల పక్షాన జరిగే పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక ,పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్,పార్టీ డివిజన్ నాయకులు ఎస్కే.సయ్యద్ , ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి వాజిద్, జిల్లా కమిటీ సభ్యులు  చిత్తలూరు లింగయ్య, పుప్పాల అంజయ్య, పివైఎల్ జిల్లా నాయకులు మచ్చ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.