సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
గ్రామీణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సర్వసభ్య సమావేశంలో గత ఎజెండా అంశాలను ఆమోదిస్తూ ప్రస్తుతం ఏజెంట్ అంశాలపై చర్చించారు. వ్యవసాయ, ఉద్యానవన, పాశుద్ధ్యం, గ్రామీణ నీటి సరఫరా ,మహిళా శిశు సంక్షేమ, విద్య, వైద్యం, విద్యుత్తు, రోడ్ రవాణా, రెవెన్యూ, పంచాయతీ రాజ్ ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ఆయా శాఖలలో ఉన్న సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ రానున్న మాసాలలో మరిన్ని నిధులతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మూడు కోట్ల నిధులతో పెండింగ్ పనులను త్వరితగతినా పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికీ గ్రామాలలో మౌలిక వసతులతో పాటు,రోడ్డు పనులు అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. లష్కర్ గూడ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టుటకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, అందుకు సంబంధించి కాంట్రాక్టర్ తో మాట్లాడి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకతీతంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ముందుకెల్దామని అని అన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి సాధికారత సాధించుటకు ప్రజాప్రతినిధులు ముందుండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ద ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహాసీల్దార్ అనితా రెడ్డి, జడ్పిటిసి బింగి దాస్ గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, ఎంపీడీవో మమతా భాయి, ఎంపిఓ వినోద, సర్పంచులు ముద్ధం స్వరూప వీరస్వామి, జక్క లావణ్య, సురకంటి వనజ, అంతటి యశోద, పోచంపల్లి సుధాకర్ రెడ్డి, కరిమెల వెంకటేష్, చెరుకు కిరణ్ కుమార్ గౌడ్, ఎంపీటీసీలు మేడిపల్లి బాలమణి, రాచపాక లావణ్య, సీక సాయికుమార్ గౌడ్, కేశెట్టి వెంకటేష్,బీమగోని భాస్కర్ గౌడ్, సిడిపిఓ వినితా దేవి, గ్రామపంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.