చీకట్లో కాదు..పగటిపూట వెళితే పనులు కనిపిస్తాయి ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌

నవతెలంగాణ-దేవరకొండ
ప్రాజెక్టుల సందర్శన చీకట్లో కాదు…. పగటిపూట వెల్లితే జరిగిన పనులు కనిపిస్తాయని దేవరకొండ శాసనసభ్యులు రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్‌ పాండే ఆదివారం రాత్రి నియోజకవర్గంలోని చందంపేట మండలం నక్కలగండి రిజర్వాయర్‌ పనులను పరిశీలించారన్నారు. ఈ ప్రాంత ప్రాజెక్టులపై అవగాహన లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అవస్తవాలు మాట్లాడడం నియోజకవర్గ ప్రజలను, ప్రజా ప్రతినిధులను, అవమానపరచడ మేనన్నారు.కట్టమీద కుర్చీ వేసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ ఇచ్చిన మాట వాస్తవమేనని, ఆ కుర్చీ మాకిచ్చి మాచేత ప్రాజెక్టులను పూర్తి చేయిస్తున్న మహానాయకుడు కేసీఆర్‌ అన్నారు. నియోజకవర్గంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని, బీజేపీ నాయకులు కళ్ళుండి చూడలేని కబోదిలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. నియోజక వర్గంలోని సింగరాజుపల్లి, గొట్టిముక్కల,కిష్టరాయినిపల్లి, నక్కలగండి ప్రాజెక్టు, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌, తదితర ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దేవరకొండ నియోజకవర్గం వెనకబడిన ప్రాంతమని హేళన చేయడం కాదు …ఒకప్పుడు వెనకబడిన ప్రాంతమైన ప్రస్తుతం అన్నింట్లో ముందుందన్నారు.నియోజకవర్గంలో రూ.600 కోట్లతో ఐదు లిఫ్టులతో 40 వేల ఎకరాలకు సాగునీరందించే పనులు జోరుగా సాగుతున్నాయని చెప్పారు. గత ఎన్నికలలో డిపాజిట్‌ కోల్పోయిన బీజేపీ రానున్న ఎన్నికలలో ఎలా అధికారంలోకి వస్తారని ఆయన ప్రశ్నించారు. జాతీయ పార్టీ హోదా ఉండి ఈ ప్రాంతంపై అవగాహన లేకుండా మాట్లాడడం మంత్రికి తగదన్నారు.దేశంలో అధికారం ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. దమ్ముంటే పాలమూరుు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించి, నిధులు మంజూరు చేసి మాట్లాడాలన్నారు.ఇంతవరకు కృష్ణా జలాలలో తెలంగాణ వాటా తేల్చలేకపోయారని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు తాగు,సాగునీటిని అందించే బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు.కేసీఆర్‌ అవినీతికి పాల్పడితే దేశంలో అధికారంలో ఉన్న మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కర్నాటకలో ఫలితమే ఎవరు అవినీతికి పాల్పడింది తేలిపోయిందన్నారు.ఈ సమావేశంలో నేరేడుగొమ్ము జెడ్పీటీసీ బాలునాయక్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మెన్‌ రెహత్‌అలీ, వైస్‌ఎంపీపీ చింతపల్లి సుభాష్‌, నాయకులు టీవీఎన్‌రెడ్డి,ముత్యాల సర్వయ్య, రాజినేని వెంకటేశ్వరరావు, వి.విద్యాసాగర్‌రావు,వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ,బైరెడ్డి కొండల్‌రెడ్డి, పొన్నబోయిన సైదులు, ఆరెకంటి రాములు, ప్రదీప్‌, ఇలియాస్‌,తదితరులు పాల్గొన్నారు.