– ఉధృతమైన అంగన్‌వాడీల సమ్మె
– ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి.. ఉద్రిక్తత
– పలుచోట్ల అరెస్టులు
కనీస వేతనాఉ, చట్టపరమైన హక్కుల సాధన, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె ఉధృత రూపం దాల్చింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున ధర్నా చేశారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలు చోట్ల నేతలు, అంగన్‌వాడీలను పోలీసులు అరెస్టు చేశారు.
నవతెలంగాణ- విలేకరులు
సీఐటీయూ, ఏఐటీయూసీి జేఏసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్ ధర్నాచౌక్‌లో నుంచి జిల్లా కలెక్టరేట్ ప్రధాన ముఖద్వారం వరకు ప్రదర్శనగా చేరుకొని బైటాయించారు. కార్యాలయం ప్రధాన ద్వారం ఎక్కి లోపలికి ప్రవేశించేందుకు ప్రయ్నతించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం ఐదుగురిని కలెక్టర్ ప్రియాంక అలాతో మాట్లాడించేందుకు తీసుకెళ్లారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన నాయకులు.. సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టే ప్రయత్నం మానుకోవాలని కోరారు. సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తానని కలెక్టర్ తెలిపారు. అనంతరం పీడీ విజేత అంగన్వాడీల వద్దకు వచ్చి.. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఇప్పటికైనా సెంటర్లకు వెళ్లాలని సూచించడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకూ కేంద్రాలను తెరిచేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్ (టీచర్స్) అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలకీë, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజి రమేష్, అధ్యక్షులు బ్రహ్మచారి, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పద్మ పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సమ్మెకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైపాల్ మద్దతు తెలిపారు.
శేరిలింగంపల్లి పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు తరలిస్తున్న వంట సామాగ్రి, బలామృత ప్యాకెట్లను అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ పర్యటన నేపథ్యంలో ఆమనగల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ యూనియన్ టీచర్లు, ఆయాలు, సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్యను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో చేపట్టిన సమ్మెకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మద్దతు తెలిపారు. అంగన్‌వాడీలు ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట వంటావార్పు చేపట్టారు.
దహెగాం, ముధోల్‌లో మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో డీసీఎంఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కాన్వారుని అంగన్‌వాడీ ఉద్యోగులు అడ్డుకుని మంత్రికి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రాన్ని అందజేశారు. యాదాద్రి భువనగిరిలో ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలు, సీఐటీయూ నేతలను అరెస్టు చేశారు.