నవతెలంగాణ-జగిత్యాల
గృహలక్ష్మి, బీసీ, మైనార్టీ, దళితబంధు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేలకు బంధుగా మారాయని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధుల జోక్యం లేకుండా, అవినీతికి తావులేకుండా పారదర్శకత కోసం కంప్యూటర్ ఆధారంగా అర్హులను ఎంపిక చేయాలన్నారు. దళితుల సంక్షేమం కోసం నిధులు కేటాయించి, బడ్జెట్లో ఆమోదించిన రూ.40వేల కోట్ల నిధులను ఖర్చు చేయకుండా దళితుల హక్కులు కాలరాశారని విమర్శించారు. దళితబంధు పథకం అర్హుల ఎంపిక ప్రక్రియలో కలెక్టర్‌తోపాటు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండేలా ఉత్తర్వులు జారీ చేసి రెండున్నర నెలలు గుడుస్తున్నా ఇంకా స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేనా ఎంపీనా, సర్పంచా ఎవరో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ సభ ఏర్పాటు చేసి అర్హులను ఎంపిక చేస్తారా లేక ఎంపిక ప్రక్రియలో జిల్లా కలెక్టర్ పాత్ర ఏమిటీ, వంటి అంశాలపై బహిరంగ ప్రకటన చేయాలన్నారు.. ఈ సమావేశంలో పీసీసీ ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు బండ శంకర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దర రమేశ్‌బాబు, కాంగ్రెస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు బొల్లి శేఖర్, సీనియర్ నాయకులు తాటిపర్తి దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.