– టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితో భేటీ
– రెండు రోజుల్లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
నవతెలంగాణ-ఆమనగల్
బీఆర్‌ఎస్‌కు ఆ పార్టీ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు. అలాగే, నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ బాలాజీసింగ్ కూడా బీఆర్‌ఎస్‌కి రాజీనామా చేశారు. అనంతరం వారు హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. రెండ్రోజుల్లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతామని ప్రకటించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీ చేయాలని భావించారు. ఈ క్రమంలో అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు మరోసారి అవకాశం కల్పించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని అధిష్టానం నచ్చజెప్పి హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. దాంతో అధిష్టానం ఆదేశాల మేరకు 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కసిరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనుచరుల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలతో పార్టీలో సముచిత స్థానం దక్కకపోగా సంక్షేమ పథకాల అమలులో కసిరెడ్డి అనుచరులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తన అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ఎమ్మెల్సీ కసిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ బాలాజీ సింగ్.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డిని పోటీకి దింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖ నాయకులతో కలిసి రెండు మూడు రోజుల్లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ఎమ్మెల్సీ కసిరెడ్డి తెలిపారు.