– గోల్డ్‌ఫిిష్ అధినేత చంద్రశేఖర్ విమర్శ
– న్యాయపరమైన చర్యలు
– తీసుకుంటామని హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణా శాసనమండలి సభ్యులు చల్లా వెంకట్రామిరెడ్డి తమను వేధిస్తున్నారని గోల్డ్ ఫిష్ అబోడ్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ ఎండీ వేగి చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకట్రామిరెడ్డి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌రెడ్డి కలిసి తమపై తప్పుడు పోలీసు కేసులు బనాయిస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. చివరకు పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ గోల్డ్‌ఫిష్ కంపెనీపై చల్లా వెంకట్రామిరెడ్డి చేసిన పలు ఆరోపణలకు వివరణ ఇచ్చారు. పలు గృహనిర్మాణ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేసిన చరిత్ర తమ గోల్డ్‌ఫిష్ సంస్థకు ఉందన్నారు. కోకాపేటలోని సర్వే నెంబరు 85లో ఉన్న 2.30 ఎకరాల స్థలానికి సంబంధించి వివాదం నెలకొందన్నారు. ఆ స్థలంలో ప్రాజెక్టు అభివృద్ధి చేయాలని భావించామన్నారు. స్థలానికి సంబంధిత డాక్యుమెంట్లను మీడియాకు విడుదల చేశారు. తప్పుడు సమాచారం, అర్థ సత్యాలతో తమ కంపెనీ మీద బురద జల్లే ప్రయత్నం చేయడాన్ని ఖండించారు. నిజాన్ని ఎదుర్కోలేక ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి తమను మోసగాళ్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు ఆయన రాజకీయ ఎత్తులకు తాము బయపడేది లేదనీ, వాటిని చట్టబద్దంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అధికార దుర్వినియోనికి పాల్పడుతున్నట్టు చెప్పారు. తమపై చేస్తున్న అరాచకాలకు తలొగ్గబోమనీ, న్యాయవ్యవస్థ తలుపు తడుతామన్నారు. తగిన న్యాయం దక్కుతుందని ఆశిస్తున్నట్టు వివరించారు. వెంకట్రామిరెడ్డికి తమ కంపెనీ వ్యాపారానికి సంబంధించి మాట్లాడే హక్కు లేదని వ్యాఖ్యానించారు.