నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా లబ్దిపొందేందుకే బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల చట్టం చేసిందనీ, దీనిలో ఎలాంటి పారదర్శకత లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ చట్టంలో ఓబీసీలకు కోట కల్పించలేదనీ, ఆ డిమాండ్ సాధన కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు అమలును జనగణన, నియోజక వర్గాల పునర్విభజనకు ముడిపెట్టిం దని వివరించారు. ఇదో తేదీ వేయని పోస్ట్ డేట్ చెక్ అని విమర్శించారు. తేదీ లేదు కాబట్టి రిజర్వేషన్లు ఎప్పుడు అమలు అవుతాయో తెలీదన్నారు. శుక్రవారంనాడామె లండన్‌లోని అంబే ద్కర్ మ్యూజియాన్ని సందర్శించారు. అక్కడి ఫెడరేషన్ ఆఫ్ అంబేద్కర్ అండ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యం లో జరిగిన సదస్సులో ఆమె మాట్లా డారు. అంబేద్కర్ రచించిన రాజ్యాం గం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్ సమస్యలను ముందే ఊహించి, దూర దృష్టితో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 చేర్చారని చెప్పారు. హైదరాబాదు నడిబొడ్డున సీఎం కేసీఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయించారనీ, సచివాలయా నికి కూడా ఆయన పేరే పెట్టారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా పార్లమెంటులో కేవలం 15 శాతం మాత్రమే మహిళల ప్రాతినిధ్యం ఉందనీ, రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి వస్తే 181 మంది మహిళలను అక్కడ చూస్తామని తెలిపారు.