జాతీయ భద్రతపై మోడీ ప్రభుత్వం రాజీ : కాంగ్రెస్‌

గౌహతి : జాతీయ భద్రతపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజీ పడుతోందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు అజరు మాకెన్‌ విమర్శించారు. ఎన్నికల ప్రయోజనాల కోసం విద్వేష రాజకీయాలను మోడీ ప్రభుత్వం ఉపయోగిస్తుందని, రాజ్యాంగ విలువలను – ప్రజాస్వామ్య సంస్థలను బలహీనం చేస్తుందని ఆయన అన్నారు. తొమ్మిదేళ్లు పూర్తయిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపేందుకు 35 నగరాల్లో ‘తొమ్మిదేళ్లు తొమ్మిది ప్రశ్నలు’ పేరుతో విలేకరుల సమావేశాలు నిర్వహిస్తామని శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గౌహతిలో అజరు మాకెన్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించకూడదని బిజెపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మాకెన్‌ విమర్శించారు. ఆర్థిక అసమానతలు భారీగా పెరుగుతున్నప్పటికీ దేశ ఆస్తులను మోడీ తన స్నేహితులకు విక్రయిస్తున్నారని చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని, ప్రతిపక్ష పార్టీలపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలిపారు. రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తామనే హామీని నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. తొమ్మిదేళ్లలో మోడీ ఒక్క విలేకరుల సమావేశంలో కూడా పాల్గొనలేదని మాకెన్‌ విమర్శించారు.