ఆ బిగ్‌షాట్ల గురించే మోడీకి బెంగ

Modi is worried about those bigshots– కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంక ఫైర్‌
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కేవలం ఆ ఇద్దరు బిగ్‌షాట్లను బాగు చేయటం గురించే మోడీకి బెంగ పట్టుకుందని, వారి అభివృద్ది గురించే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఆలోచన చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రభుత్వ రంగ సంస్థల ను మోడీ సర్కారు వాళ్లకే ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. దేశంలో బడా వ్యాపారులైన గౌతమ్‌ అదానీ, ముకేశ్‌ అంబానీల పేర్లను నేరుగా ప్రస్తావించ కుండా వాళ్లను ఉద్దేశించి ప్రియాంకాగాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నుంచి లబ్ది పొందుతున్న ఆ ఇద్దరు బడా వ్యాపారులు గానీ, కేంద్ర సర్కారు గానీ నిరుద్యోగుల కోసం ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడం లేదని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. ప్రధాని మోడీ మహిళా రిజర్వేషన్‌ గురించి మాట్లాడారని, కానీ అది పదేండ్ల తర్వాత అమలవు తుందని ప్రియాంకాగాంధీ తెలిపారు. ఆయన కుల గణన ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఈస్టర్న్‌ రాజస్థాన్‌ కెనాల్‌ ప్రాజెక్టు గురించి హామీ ఇచ్చిన కేంద్రం.. ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు కోసం చేసేందేమీ లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోందని, కానీ, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని చెప్పారు.