– బీమా పేరుతో కార్పొరేట్లకు రూ.57 వేల కోట్లు
– వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు ఢిల్లీ తరహా ఉద్యమం : ఎస్‌కేఎం సదస్సులో రైతు సంఘాల నేతలు
నవతెలంగాణ-కొత్తగూడెం
”రైతాంగాన్ని మోసం చేయడంలో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పోటీ పడుతున్నారు.. ఇలాంటి రైతు వ్యతిరేకులను గద్దె దించితేనే రైతాంగానికి న్యాయం జరుగుతుంది.. వ్యవసాయరంగం పరిరక్షించబడుతుంది..” అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, మరో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శేషగిరిభవన్‌లో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయరంగం బతకాలంటే బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలను గద్దెదించేందుకు కార్మికులు, కర్షకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో అదానీ, అంబానీలాంటి కుబేరులకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే కుట్రలకు పూనుకుందన్నారు. సబ్సిడీల్లో భారీగా కోతలు విధిస్తూ పోతూ.. భవిష్యత్తులో పూర్తిగా ఎత్తేసి రైతులను నట్టేట ముంచి కార్పొరేట్ శక్తులకు ఊతం ఇచ్చే చర్యలు చేపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుబంధు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మోసానికి పాల్పడుతుండగా అదేబాటలో మోడీ ఎకరాకు ఆరువేల రూపాయలంటూ రైతులను మభ్యపెట్టి మరోసారి గద్దెనెక్కే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ పథకాలు కేవలం భూస్వాముల ఖజానా నింపేందుకే ఉపయోగపడు తున్నాయని, సన్న, చిన్నకారు రైతులకు, కౌలు రైతులకు మేలు చేయడం లేదని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన సఫర్ బీమా యోజన పథకం బీమా సంస్థలకు దోచి పెట్టేందుకేనని, ఆ పేరుతో రూ.57వేల కోట్లు సంస్థలకు అప్పనంగా దోచిపెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంబవించినప్పుడు రైతులను ఆదుకునేందుకు ఎటువంటి బీమా సౌకర్యం లేదన్నారు. రైతు రుణాల మాఫీకి సంబంధించి కూడా మోసం చేస్తున్నారని విమర్శించారు.
ఏఐపీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కెచ్చెల రంగారెడ్డి, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, ఏఐకెఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిడాల బిక్షపతి మాట్లాడారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతు ఉద్యమం చారిత్రాత్మకమని, ఈ ఉద్యమంతో నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రకటించిన మోడీ దొడ్డిదారిన అమలు చేసే కుట్రలకు తెరలేపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఉద్యమ తరహాలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రా రైతులు, జర్నలిస్టుల హత్యకు కారకులయ్యారని, ఆయన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 3న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. నవంబర్ 23 నుంచి మూడ్రోజులపాటు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు.
రైతు సంఘాల జిల్లా నాయకులు అన్నవరపు సత్యనారాయణ, చండ్ర నరేంద్రకుమార్, కల్లూరి కిషోర్, కందగట్ల సురేందర్, బానోతు ఊక్లానాయక్ అధ్యక్షతన జరిగిన సదస్సులో సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కార్యదర్శులు అన్నవరపు కనకయ్య, ఎస్ కె.సాబీర్ పాషా, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ముత్యాల విశ్వనాధం, చంద్రగిరి శ్రీనివాసరావు, ఎల్.విశ్వనాధం, యలమంచి వంశీ కృష్ణ, సలిగంటి శ్రీనివాస్, ముద్దా బిక్షం, బుర్రా వెంకన్న, వి.కోటేశ్వర్రావు, బట్టు ప్రసాద్, రేసు ఎల్లయ్య, ఏజే.రమేష్, వీసంశెట్టి పూర్ణచందర రావు, ఉప్పరబోయిన రమ్మూర్తి, కె.రత్నకుమారి, పద్మజ, రేపాకుల శ్రీనివాస్, అమర్లపూడి రాము, కొక్కెరపాటి పుల్లయ్య, కున్సోతు ధర్మ, వూకంటి రవికుమార్, దొడ్డ లక్షయ్మ పాల్గొన్నారు.