మోడీ మౌనం వీడాలి

– విభజన రాజకీయాలకు తక్షణమే ముగింపు పలకాలి
– హింసకు అడ్డుకట్ట వేయాలి
– అల్లర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత
– మణిపూర్‌ హింసాత్మక పరిస్థితులపై
– 550కు పైగా పౌర సంఘాలు, వ్యక్తుల ఖండన
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితులపై దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి పౌర సమాజం స్పందించింది. ఇక్కడి పరిస్థితులపై ఆందోళనను వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న హింసను దాదాపు 550కి పైగా పౌర సంఘాలు, ప్రముఖ వ్యక్తులు ఐక్యంగా ఖండించారు. ఈ మేరకు పౌర సంఘాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. అన్ని పక్షాలూ కాల్పుల విరమణను ప్రకటించాలని కోరాయి.
కుకీల మీద హింసపై ఆందోళన
ప్రధాని మోడీ తన మౌనాన్ని వీడాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పాయి. హింసకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేశాయి. రాష్ట్రంలోని ఈ పరిస్థితులకు కేంద్ర, రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలే బాధ్యులని పౌర సంఘాలు పేర్కొన్నాయి.
రాష్ట్ర, భద్రతా బలగాల ద్వారా కొనసాగుతున్న విభజన రాజకీయాలకు తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిచ్చాయి.
ఎలాంటి చర్చలు జరపడానికి, తీర్మానం చేయడానికి అర్థవంతమైన ప్రయత్నాలను చేయకుండానే.. బీజేపీ మెయిటీ, కుకీ, జో వర్గాల మధ్య చారిత్రక గందరగోళాన్ని తీవ్రతరం చేస్తున్నదనీ, విభజన రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించాయి. కుకీలకు వ్యతిరేకంగా సాయుధ మెయిటీ మెజారిటీ గ్రూపులైన అరంబరు టెంగ్గొల్‌, మెయిటీ లీపున్‌లు చేస్తున్న హింసపై ఆందోళనను వ్యక్తం చేశాయి.
కోర్టు పర్యవేక్షణలోని ట్రిబ్యునల్‌కు డిమాండ్‌
అల్లర్ల నేపథ్యంలో ప్రధాని జవాబుదారీతనంతో పాటు ప్రభుత్వం నుంచి అనేక కీలక చర్యలకు పౌర సంఘాలు డిమాండ్‌ చేశాయి. నిజాలు నిగ్గు తేల్చడానికి, న్యాయాన్ని కల్పించడానికి కోర్టు పర్యవేక్షణలోని ట్రిబ్యునల్‌కు పిలుపునిచ్చాయి. వర్మన్‌ కమిషన్‌ సూచించినట్టుగా లైంగిక హింస కేసుల పరిష్కారం కోసం ఫాస్ట్‌-ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని పౌర సంఘం సభ్యులు డిమాండ్‌ చేశారు. ఇండ్లు వదిలి పారిపోయిన వారికి సహాయక చర్యల ప్రాముఖ్యతను ఈ ప్రకటన నొక్కి చెప్పింది.
‘రిటైర్డ్‌ జడ్జిలతో ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలి’
పునరావాసం, పరిహారం, ఇండ్లకు తిరిగి వచ్చే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈ ప్రాంతంతో సంబంధమున్న రిటైర్డ్‌ జడ్జీలతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలనీ, వీరిని సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ద్వారా నియమించాలని సూచించింది.
ఈ సంయుక్త ప్రకటనను విడుదల చేసినవారిలో ఎంపీ మనోజ్‌ కుమార్‌ ఝా, రిటైర్డ్‌ బ్యూరోక్రాట్లు మీనా గుప్తా, పి గంగ్టే, మీరన్‌ బోర్వాంకర్‌ పలువురు సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, సినిమా కళాకారులు, రచయితలు, లాయర్లు ఉన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితుల్లో పూర్తి వైఫల్యం
మణిపూర్‌లో శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా వైఫల్యం చెందాయని సాక్షాత్తూ కేంద్ర మంత్రి ఆర్కే రంజన్‌ సింగ్‌ అన్నారు. హింసాత్మక అల్లర్లలో భాగంగా ఆందోళనకారులు తూర్పు ఇంఫాల్‌లోని ఆయన ఇంటికి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. అనంతరం శుక్రవారం నాడు రంజన్‌ సింగ్‌ శాంతి భద్రతల వైఫల్యంపై వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. మణిపూర్‌లో బీజేపీ సర్కారు ఉండటం, సాక్షాత్తూ కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తే ప్రభుత్వ వైఫల్యం ఉన్నదని చెప్పటం చర్చకు దారి తీసిందని విశ్లేషకులు అన్నారు.
గతనెల 25 తర్వాత మొదటి సారి ఆయన ఇంటిపై దాడి జగింది. ఇటీవల జరిగిన దాడి రెండోది కావటం గమనార్హం. మొదటిసారి మెయిటీ గ్రూపే భారీ సంఖ్యలో వచ్చి దాడి చేసింది. ఇటు కేంద్ర మంత్రి కూడా అదే సామాజిక వర్గానికి చెందినవాడు అయినప్పటికీ ఆయన ఇల్లు దాడికి గురి కావటం గమనార్హం. రాష్ట్రంలోని ప్రస్తుత ప్రభుత్వం శాంతిని కాపాడలేకపోయిందని ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న రంజన్‌సింగ్‌ ఆరోపించారు.

కేంద్ర మంత్రి