‘ఉపాధి’కి ఉరివేసేందుకు మోడీ కుట్ర

ఏటా నిధుల
కేటాయింపులో కోత
 అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
నవతెలంగాణ-మునగాల
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ఉపాధికి ఉరేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని గణపవరం, తిమ్మారెడ్డిగూడెం గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశాలను ఆయన సందర్శించారు. కూలీలతో మాట్లాడారు యూపీఏ ప్రభుత్వం హయాంలో పోరాడి సాధించుకున్న చట్టాన్ని మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక అనేక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. బడ్జెట్‌లో నిధులను కుదించి ఈ పథకాన్ని క్రమంగా కూలీలకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా కేంద్ర బడ్జెట్‌లో 2 లక్షల 50 వేల కోట్లు కేటాయించాల్సింది పోయి ఈ ఏడాది రూ.65 వేల కోట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్షాల వల్ల సాధించుకున్న ఈ చట్టాన్ని నీరుగారిచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి చట్ట రక్షణ కోసం జరిగే ఉద్యమంలో వ్యవసాయ కూలీలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగటంతో పని దినాలు పడిపోతున్నాయని, ఫలితంగా వ్యవసాయ కూలీలు వలసలు పోతున్నారని తెలిపారు. వ్యవసాయ కూలీలకు పనులు కల్పించేందుకు సంవత్సరానికి ఉపాధి హామీలో 200 రోజులు పని దినాలు.. రోజుకు 600 రూపాయల కూలి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
ఈ పర్యటనలో ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు వేలిది పద్మావతి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చందా చంద్రయ్య, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య, జిల్లా సహాయ కార్యదర్శి పటాన్‌ మైబెల్లి, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు తదితరులు ఉన్నారు.