– చట్టానికి నిధుల కోత, ఆన్‌లైన్ హాజరు నమోదు దుర్మార్గం :
– మంత్రి ఎర్రబెల్లికి వ్యవసాయ కార్మిక సంఘం నేతల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ పనులను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలనే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయం సరిగాదనీ, దాన్ని అమల్లోకి తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఆ సంఘం ప్రతినిధులతో కలిసి వారు వినతిపత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి ఏటేటా నిధుల్లో కోత పెడుతూ పోతున్నదనీ, పనిప్రదేశంలో రెండు సార్లు ఫొటో క్యాప్చర్ ద్వారా ఆన్‌లైన హాజరు తీసుకుంటుందని తెలిపారు. ఆన్‌లైన్ హాజరు, ఆధార్ ప్రాతిపదికన వేతనాలు ఇవ్వడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కూలీలకు సకాలంలో కూలి అందటం లేదని తెలిపారు. ఉన్న జాబ్‌కార్డులను తొలగిస్తూ కొత్త కార్డులను ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ చట్టం రక్షణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.