నిబంధనల ప్రకారం మీడియాపై పర్యవేక్షణ

Monitoring of media as per norms–  అదనపు ఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాబోయే ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికలకమిషన్‌ సూచించిన నిబంధనల ప్రకారం మీడియా పోషించే పాత్రను పర్యవేక్షించాలని రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్‌ సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని బీఆర్‌ కేఆర్‌ భవన్‌లో ఆయన ఎన్నికల్లో మీడియా పాత్ర పర్యవేక్షణపై జిల్లా పౌర సంబంధాల అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికల సమయాల్లో వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే పెయిడ్‌ న్యూస్‌ గుర్తించే ప్రక్రియపై అధికారులకు అవగాహన కల్పించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే కోడ్‌ అమల్లోకి వస్తుందనీ, అప్పటి నుంచి మీడియా సర్టిఫికేషన్‌ , మానిటరింగ్‌ కమిటీ ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాను పర్యవేక్షించాలన్నారు. కేంద్ర ఎన్నికల కమీషన్‌ విడుదల చేసిన ప్రాణానిక ప్రక్రియ పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత నుంచి వార్తా పత్రికల్లో అభ్యర్థులకు వచ్చే ప్రకటనలను ప్రతి రోజు సేకరించాలనీ, అభ్యర్థులకు అనుకూలంగా వచ్చే వార్తల గుర్తింపు, పెయిడ్‌ న్యూస్‌ నమోదు తదితర అఉశాలపై అవగాహన కల్పించారు.