భూమి తమ్ముడు చంద్రుడు

‘చంద్రయాన్‌ 3’ ప్రయోగ విషయం లోంచి రకరకాల కోణాలను చూసినపుడు సగటు మనిషి ఒకరకంగా స్పందన తెలియజేస్తాడు. సామాజికంగా బాధ్యతలో ఉన్న వ్యక్తి ఆలోచన మరో రకంగా ఉంటుంది. సైన్స్‌ పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు దీనినో ప్రత్యేకత గల అంశంగా ప్రయోగాత్మక దృష్టి కోణంలో చూస్తారు. కవి మాత్రమే సామాజికంగా చూడగలడు. అనుభూతిని చెందగలడు. ఎన్నో కోణాల్లోంచి కవిత్వీకరించగలడు.
ఈ ప్రయోగ ప్రయోజనం ఏమిటి? సాంకేతికంగా ముందుకు వెళ్తున్నామా? సామాజికంగా వెనుకబడుతున్నామా? అనే ప్రశ్నలు ఇలాంటి సమయంలో ఉత్పన్నమవుతుంటాయి. ఇవి సహజాతి సహజం. ప్రశ్న పూర్తి సమాధానాన్ని రాబట్టకపోయినా కొంత ఆలోచననయినా కలుగజేస్తుంది. ప్రశ్నెప్పుడూ మంచిదే. తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఈ సందర్భంగా కవులు తమ కవిత్వం ద్వారా చంద్రయాన్‌ 3 ప్రయోగం మీద విముఖతను తెలియజేస్తూ, సుముఖతను తెలియజేస్తూ కవితలు రాశారు. విముఖత, సుముఖత అనేవి భిన్న పార్శ్వాలు. వారి వారి వ్యవస్థాపరమైన అవగాహనతో అది వ్యక్తపరచబడుతుంది.
కవిత్వానికే పరిమితం చేసి చూసినప్పుడో, ఒక పాటకి పరిమితం చేసి చూసినప్పుడో జాబిలి పదం ఉన్న ప్రతి పాట హిట్టే. చందమామను అనుభూతి చెందని వారు ఉండరు. ఇప్పుడు సెల్‌ఫోన్‌ పాటలు వచ్చాయేమో కానీ అప్పుడు ‘చందమామ రావే’ అనే పాట తెలియని, పాడని వారు లేరు. చంద్రుడిని సొంతమామలా చేసుకొని మాట్లాడే వాళ్ళు ఎంతోమంది. అలా అనుభూతి చెందిన వాళ్ళలో ఒకరయినటువంటి వారు ‘మామా! చందమామ’ కవిత రాసిన ఏనుగు నరసింహారెడ్డి.
చిన్నతనంలో చందమామను చూసి, అనేక రకాలుగా అనుభవాన్నొందిన స్థితిలోంచి ఎత్తుగడ వాక్యాలను రాశాడు. ఎత్తుకోవడంలోనే స్పష్టంగా మధ్యమ పురుషను వాడుకొని కవితా ప్రయాణాన్ని సులభతరం చేసుకున్నాడు. ఈ సందర్భంలో అఫ్సర్‌ గురించి మాట్లాడుకోవాలి. ఎక్కువశాతం కవితలు మధ్యమపురుషలోనే రాస్తుంటాడు. ఇదో టెక్నిక్‌.
ఇక్కడ ఇంకొక మెలిక ఉంది. మధ్యమ పురుషలోనే రాస్తాడు కానీ ‘నీ’ అనే ప్రయోగాన్ని కనబడనివ్వడు. వాక్యాల లోపలనే అంతర్గతంగా ఉంచుతాడు. అది అతని విలక్షణత. కానీ సహజత్వాన్ని దెబ్బతిననివ్వడు. అందరికలా సాధ్యంకాదు కాబట్టి ఉత్తమ, మధ్యమ పురుషలను కోరి కోరి ఆశ్రయించటం కన్నా వస్తువు ననుసరించి సాగితే మేలు.
ఏనుగు నరసింహారెడ్డి తాదాత్మ్యం చెందుతూ, వస్తువుననుసరించి కవితను అల్లుకుంటూ వెళ్ళాడు. వీరు సందర్భోచితంగా ఏ వస్తువులోకయినా పరకాయ ప్రవేశం చేసి కవితా రూపపు ప్రతిని మనకందించగల సమర్థులు. సెకండ్‌ పర్సన్‌ విషయంలోనే వీరిద్దరి గురించి ఇక్కడ మాట్లాడాల్సొచ్చింది. శైలి పరంగా, వస్తువుల ఎంపిక పరంగా ఇద్దరు వేరు వేరు.
భూమికి, చంద్రునికి ఉన్న సహజ సంబంధాన్ని సోషల్‌ స్టడీస్‌లో చదువుకుంటాం. భూమికి, చంద్రుడు ఉపగ్రహమని దాదాపుగా అందరికీ తెలుసు. ఈ విషయాన్ని చెప్పటంలో కవి చంద్రున్ని, భూమికి తమ్ముడు అని చెప్పటంలో నవీన వ్యక్తీకరణ కనిపిస్తుంది. ఇందులో నర్మగర్భంగా చెప్పిన విషయమేది లేదు. కానీ బరువైన కవితావాక్యం తయారయింది. ”భూమిఅమ్మకు/ నువ్వు తమ్ముడి వేనని/ అప్పటినుండీ మా నమ్మకం”.
వస్తువు నిర్వహణ కొచ్చేసరికి రెండవ యూనిట్‌లో సౌందర్యారాధనను జొప్పించాడు. చందమామను చూసినప్పుడు కలిగే అనుభూతులను ఒక్కొక్కటిగా కళాత్మకంగా చెప్పుకొచ్చాడు. స్త్రీల ముఖాన్ని చందమామతో పోల్చటం పదే పదే చూస్తుంటాం. ఒక్కో కవి ఒక్కో రకంగా అభివ్యక్తిని సాధిస్తాడు. నరసింహారెడ్డి చేసిన పోలిక ఆధునికంగా ఉంది. ప్రస్తుత కాలంలో వదనం, ఇంతి లాంటి పదాల వాడకం కొంచెం ఆలోచించదగినది. ”పున్నమి నాటి నవ్వులనే/ తమ వదనంగా ఇంతులు ధరిస్తే/ దూరం దూరంగా నింగి నిండా విహారం చేస్తివి”.
భౌగోళిక పరిస్థితుల అవగాహన, సాహిత్య పరమైన జ్ఞానం ఈ కవికి ఎక్కువగా ఉంది. అందుకే వారు గ్రూప్స్‌ సాధించి అత్యున్నత ఉద్యోగంలో స్థిరపడ్డారు. ఒక్కోసారి తెలియకుండానే విశ్వవిద్యాలయ స్థాయిలో, డిగ్రీ స్థాయిలో, పాఠశాల స్థాయిలో చదువుకొని వచ్చిన విషయం కవిత్వంలోకి జొరబడుతుంది. వయసు రీత్యా మెదడుపై అప్పటి అంశాల ప్రభావం కావచ్చు, ఇష్టం కావచ్చు. కొన్నిసార్లు యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. కానీ నరసింహారెడ్డి ఇక్కడ పూర్తి విషయావగహనతో వాక్యాలను నిర్మించారు. అద్దినట్టుగా సరిపోయాయి. కవికి రాస్తున్న విషయం పట్ల లోతైన అవగాహన అవసరమనేది వీరి నుండి గమనించాల్సిన విషయం.
”దాగుడు మూతల గ్రహణాలు/ లఘువేళా, పర్వవేళా తరంగాలు/ సముద్రుడితో నువ్వాడించే ఆటలు/ ఒకటా రెండా నీ కళలు”.
చంద్రుడు ఒంటరి తనాన్ని దూరం చేసే భావుకుడు. ఎనో దృశ్యాలను కానుకగా ఇస్తాడు. చంద్రుడు కవులకు అందివచ్చిన వరం. నరసింహారెడ్డి నాల్గవయూనిట్‌ లో వాడిన టెక్నిక్‌ ‘ఇమేజరీనే’. ఈ యూనిట్‌ నే మనం ఎన్నో విధాలుగా మాట్లాడుకోవచ్చు.
1. అడవి మీద సముద్రాన్ని తీసుకొచ్చి పెట్టి తడి లేదని చూపించటం.
2. ఎడారిలో వెండి ఇసుక బొమ్మను చూపించటం
3.ప్రేమికుని అంతరంగంలోని వెలుగుజిలుగుల అగ్గిరవ్వలను చూపించటం
ఇవన్నీ ఆల్బమ్‌ లో చూసినప్పుడు ఒక ఫొటో తర్వాత ఇంకోటి చూస్తుంటామే అలా కనెక్టివ్‌ గా సాగింది.
ముగింపు స్టాంజాలో చంద్రయాన్‌ ప్రయోగ విషయాన్ని తెలియపరుస్తూ… పిలిచినా నువ్వు రావు, మేమే నీ చెంతకు చేరాం అంటూ చంద్రుడికి,బ óూమికి మధ్య రాబోయే రోజుల్లో సంబంధం బలపడుతుందన్న ఒక ధోరణిని వ్యక్తపరిచాడు. ఇందులో రెండో కోణంలో వ్యంగ్య ధ్వని కూడా స్ఫురిస్తుంది. అణువణువును శోధించటమే కాదు. అణువణువును ఆక్రమిస్తాం అనేంతగా అర్థం వచ్చేలా ‘లోతులను చూస్తాం’ అనే వాక్యాన్ని తీసుకోవచ్చు. పాజిటీవ్‌ గా అర్థం చేసుకున్నప్పుడు పరిశోధనా పరమైన విజయంలో భాగంగా చూడవచ్చు. తెలుగు వాక్యాల ప్రత్యేకత అదే. శ్లేష ఎక్కువగా తొంగి చూస్తుంది. ఇలాంటి కవితలు మొదలు పెట్టేటప్పుడు చాలా సందేహాలు వస్తాయి. విజయం గురించి రాయాలా, సైన్స్‌ గురించి రాయాలా, చందమామతో అనుబంధాన్ని గురించి రాయాలా అని. యూనిక్‌ గా రాయాలా, అక్కడక్కడే కట్టుబడి రాయాలా అని. కవిత రాసేటప్పుడు అవగాహన పరమైన మూలసూత్రమొకటి అవసరం. నరసింహారెడ్డి చందమామకు, ప్రజలకు మధ్య ఉండే తాదాత్మ్యనుభవాలను మూల సూత్రంగా నిర్ధారించుకొని చక్కటి కవితను మనకందించారు.

కవిత:
మామా! చందమామ!!
భూమి అమ్మకు
నువ్వు తమ్ముడివేనని
అప్పటినుండీ మా నమ్మకం
మా లోకుల గుంపుకు
మేనమామవని నిశ్చయం
మామా చందమామా
పిలిస్తే రావా

మబ్బుల చాటున కాసేపు
తారల చెక్కిలిగింతల్లో కాసేపు ఒదిగి
కన్ను గీటేస్తుంటివిగా
అమావాస్య అని మెల్ల కన్నుతో
మిటకరిస్తివి
పున్నమి నాటి నీ నవ్వులనే
తమ వదనంగా ఇంతులు ధరిస్తే
దూరం దూరంగా నింగి నిండా విహారం చేస్తివి.
వస్తివా, రమ్మంటే తమాషా చేస్తివి.
చిన్నప్పటి నుండీ వస్తా వస్తానని
బురిడీ కొట్టిస్తివి
మామా చందమామా.

నీ వెలుగుల చలువలు మాకెరికే
నీ పక్షపు కళలన్నీ ఎరికే
దాగుడుమూతల గ్రహణాలు..
లఘువేళా, పర్వవేళా తరంగాలు
సముద్రుడితో నువ్వాడించే ఆటలు
ఒకటా రెండా నీ కళలు

అడవుల మీద తడిలేని సముద్రానివి
ఎడారుల్లో రజత సైకతాల సృష్టికర్తవు
రహదారుల్లో నలుదిశలా ముట్టించిన దివిటీవి. ప్రేమికుల అంతరంగంలో
పుట్టే చల్లని అగ్గిరవ్వవు
మామా చందమామా!

పిలిచి పిలిచీ
నువు రావని తెలిసి
ఇక నీ ఇల్లూ వాకిలి లోగిలి సర్వం శోధిస్తాము ముందూ వెనుకా ఊర్ధ్వం ఆధహం
మేమే నిను ముద్దాడాము లోతులు చూస్తాం.
మామా చందమామా!
ఇక నీకూ మాకూ ఎడతెగని ప్రయాణం
మామా! చందమామ!
– ఏనుగు నరసింహారెడ్డి

– తండా హరీష్‌, 8978439551