అమెరికాలో మరింతగా ఇండ్ల కష్టాలు

– రికార్డు స్థాయికి గృహ వసతిలేమి
అమెరికా గృహ వసతిలేమి గతంలో ఎన్నడూలేని స్థాయికి చేరిందని అమెరికన్‌ డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవెలప్మెంట్‌(హెచ్‌యూడీ) శక్రవారంనాడు విడుదలచేసిన రిపోర్ట్‌ తెలుపుతోంది. ద్రవ్యోల్బణం, సరిపడినంతగా గృహ వసతి లేకపోవటం, కోవిడ్‌ కాలంలో ఇండ్లను ఖాళీ చేయించకుండా ఇచ్చిన రక్షణల కాలపరిమితి ముగియటం వంటి కారణాలచేత ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని హె యూడీ విశ్లేషించింది. 2007లో గృహ వసతిలేని వారి సంఖ్యను లెక్కించే వ్యవస్థను ప్రవేశపెట్టిన తరువాత గృహ వసతిలేని వారి సంఖ్య 653104 కి చేరటం ఇదే తొలిసారని హెచ్‌ యూడీ పేర్కొంది. ఈ సంఖ్య గత సంవత్సరం సంఖ్య కంటే 12శాతం అదనంగా ఉంది. అంటే గత సంవత్సరం కంటే అదనంగా 70650 మంది గృహ వసతిలేని అమెరికన్లు అంతకు ముందటి సంఖ్యకు జత అయ్యారు. గతంలో ఎన్నడూలేనంతగా ఇండ్ల అద్దెలు పెరగటం, అద్దెకు ఉండేవాళ్ళకు అర్థంతరంగా ఖాళీ చేయించటం నుంచి రక్షణలు లేని కారణంగా గృహ వసతిలేమి 25శాతం పెరిగింది. అదే కాలంలో దాదాపు31శాతం గృహ వసతిలేని వారికి ఎటువంటి ఆచ్చాదనా లేకుండా పోయింది. ఈ సమస్య అన్ని వర్గాల ప్రజలలో ఉన్నప్పటికీ పిల్లలు గల కుటుంబాలు అందరికంటే ఎక్కువగా క్షోభకు గురౌతున్నాయి. గృహ వసతిలేమిని ఎదుర్కొంటున్న వారిలో ఈ కుటుంబాల సంఖ్య 15.5శాతం దాకా ఉంది. అద్దెకు ఇచ్చే ఇండ్ల సంఖ్య 2022లో అసాధారణంగా డిమాండ్‌ కంటే చాలా తక్కువ ఉందని హెచ్‌ యూడీ రిపోర్ట్‌ లో పేర్కొనటం జరిగింది. ప్రభుత్వం గ్రుహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదని సదరు రిపోర్ట్‌ తెలియజేస్తోంది. అద్దెలు భరించగలిగే ఆర్థిక సామర్థ్యం లేకపోవటమనే సంక్షోభం కొనసాగుతూనే ఉంది. 2001-2022 మధ్యకాలంలో ఇండ్ల అద్దెలు 18.8శాతం పెరగగా, అదేకాలంలో ఆదాయాలు కేవలం 4.3శాతం మాత్రమే పెరిగాయి. మూడీస్‌ అనలిటిక్స్‌ ప్రకారం కుటుంబాల ఆదాయంలో దాదాపు 30శాతం ఇండ్ల అద్దెలు కట్టటానికే పోతోంది. అదే సమయంలో ఇండ్ల ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయని బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ షెల్టర్‌ సూచిక తెలియజేస్తోంది. గృహలేమిలో ఇటువంటి దుస్థితి ‘గృహలేమి పెరుగుదలను అడ్డుకున్నాం’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించిన తరువాత సంవత్సర కాలంలోనే ఏర్పడింది.