60 శాతానికి పైగా అద్దె భవనాలే..

బాత్రూంలు, స్నానాల గదుల్లేక విద్యార్థుల అవస్థలు
– మెనూ ప్రకటించినా విడుదలలో జాప్యం
– నోట్‌ బుక్స్‌, దుప్పట్లు ఇతర సౌకర్యాల కోసం ఎదురు చూపులు
– ఉపాధ్యాయుల కొరతతో ఇబ్బందులు – వంట సరుకులకూ టెండర్లు పిలవని వైనం
– పట్టించుకోని ప్రభుత్వం
– ఇదీ రాష్ట్రంలో గురుకులాల దుస్థితి
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
రాష్ట్రంలో 60శాతానికి పైగా సంక్షేమ గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. విద్యార్థుల వసతి గృహాల స్వభావం లేని భవనాలు కావటంతో అవి సమస్యలకు నిలయాలుగా మారాయి. ఈ సమస్యలు విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. పరిష్కారానికి పూనుకోవాల్సిన సర్కార్‌ మీనమేషాలు లెక్కిస్తున్నది. మాటలు ఘనం..చేతలు శూన్యమన్నట్టుగా గురుకులాల నిర్వహణ ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి దాకా అధికారులు, సిబ్బంది దశాబ్ది ఉత్సవాల్లో నిమగం కావటం మూలంగా ఈ ఏడాది చేయాల్సిన రిపేర్లు చేయలేకపోయామని కొన్ని చోట్ల నిర్వహకులు చెబుతున్నారు. దీంతో ఊడిపోయిన బాత్రూం తలుపులు, పగిలిన కిటికీలు, తిరగని ఫ్యాన్లు, పాడైన నల్లా ట్యాపులు, సెప్టిక్‌ ట్యాంకు సమస్యలు..ఇలా ఒక్కటేమిటి? ఇలా అనేక సమస్యలు దర్శనమిస్తున్యాయి.
అద్దె భనాలే దిక్కా..?
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని సుమారు 650 గురుకులాలు అద్దెభవనాల్లోనే ఉన్నాయి. నిర్వహణ కోసం ఒక్కో గురుకులానికి నెలకు రూ. 20వేల చొప్పున ఇస్తున్నా.. అవి విద్యార్థుల కనీస అవసరాలను తీర్చలేకపోతున్నాయి.ఈ విషయం ఇప్పటికే సర్కారు దృష్టిలో ఉన్నది. ఇదిలా ఉంటే..ప్రతి ఏటా తరగతులను అప్‌గ్రేడ్‌ చేస్తూ గురుకులాలను జూనియర్‌ కళాశాలలుగా మారుస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నది. అయితే ఆయా కళాశాల్లో తగిన మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఆడంబరంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల ప్రయోజనం చేకూరటం లేదని విద్యార్ధులు చెబుతున్నారు.
ఘనమైన మాటలు..
‘రాష్ట్రంలో గురుకులాల విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఒక్కోవిద్యార్థిపై ఏటా రూ. లక్షా 25 వేలు ఖర్చు చేస్తున్నాం’ సంక్షేమ పథకాలపై చర్చ సందర్భంగా ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలివి. ఏడాదికి సుమారు రూ. 5వేల కోట్లకు పైగా విద్యార్థులపై ఖర్చు చేస్తున్నట్టు వారు వెల్లడిస్తున్నారు. అయితే కొన్ని గురుకులాలపై కేంద్రీకరించి, అక్కడ తగిన రిజల్ట్‌ రాబట్టి, వాటిని చూపించి.. మొత్తం గురుకులాలు వాటిలాగే ఉన్నట్టు ప్రభుత్వం ప్రచారం కల్పిస్తున్నదనే విమర్శలున్నాయి. వాస్తవంలో కూడా ఎక్కువ గురుకులాలు సమస్యల కేంద్రాలుగా మారాయి. అద్దె భవనాల్లో ఇరుకు గదులు, విశాలంగా గదులు లేకపోవటంతో పిల్లలు అవస్థలు పడుతున్నారు. ఒక్కో గదిలో ఒక్కో గదిలో 12 నుంచి 20మంది విద్యార్థులు ఉంటున్నారు. ఆటస్థలాలు లేకపోవటంతో పాటు . బాత్రూంల ఇక్కట్లు, మరుగుదొడ్ల కష్టాలు.. మంచినీటి వెతలు, ఆరుబైట స్నానాలు, బోధకుల లేమి, నియమ బద్దంగా సాగని చదువులు… వెరసి గురుకుల హాస్టళ్లలో విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారు.
పెరిగిన ధరలు.. నాణ్యత లేని మెనూ…
గురుకులాలకు సంబంధించి మెనూ చార్జీలను పెంచుతున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కానీ..ఆచరణలో మాత్రం అది అమలు కావటం లేదు. ఇదేందని అడిగితే..ప్రభుత్వం ఇంకా జీవో విడుదల చేయలేదని నిర్వహకులు చెబుతున్నారు. రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. 2014 నాటి ధరలతో పోల్చి చూస్తే..ఇప్పుడు 300శాతానికి పైగా ధరలు పెరిగాయి. పెరగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని విద్యార్థులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయినా ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. పైగా 2014లో ఉన్న ధరల ఆధారంగా బడ్జెట్‌ కేటాయింపులు చేస్తున్నది. దీంతో ఆహారంలో నాణ్యత తగ్గింది. పౌష్టికాహారం ప్రచారపటాటోపంగా మారింది. నీళ్ల చారు, పలచటి పప్పు, అప్పుడప్పుడు కూరగాయల భోజనం, ఎక్కువగా సాంబారు, పప్పు వండి వారుస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. మాంసం ధరలు బాగా పెరిగాయి. దీంతో వారానికి రెండు సార్లు పెట్టాల్సిన మాంసాహారాన్ని కూడా కనా కష్టంగా పెట్టాల్సి వస్తున్నదని నిర్వాహకులు చెబుతున్నారు.మరో పక్క వంట సరుకులకు నేటికీ టెండర్లు పిలవలేదు. దీంతో నిర్వహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉపాధ్యాయుల కొరత..బోధన సమస్యలు..
సాధారణ పాఠశాలలకంటే..గురుకులాల్లో ఉపాధ్యాయుల కొరత మరింత ఎక్కువగా ఉంది.ముఖ్యంగా బీసీ గురుకులాలను ఈ సమస్య ఎక్కువగా వేదిస్తున్నట్టు తెలుస్తున్నది.పార్ట్‌టైం, గెస్ట్‌ఫ్యాకల్టీల రిక్రూట్‌ మెంట్‌ను కూడా ఇప్పటి వరకూ చేయలేదు. దీంతో అన్ని తరగతులకు సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు సతమతమవుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ..ఇప్పటికే తరగతులు ప్రారంభం కావటంతో విద్యార్ధులకు తగిన విధంగా బోధన అందటం లేదని వారు వాపోతున్నారు. మరో పక్క నేటికీ విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, దుప్పట్లు, పెట్టెలు, అందలేదు. వర్షాలు కురుస్తుండటంతో చలికి విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. సర్కారు నిర్లక్ష్యం మూలంగా పిల్లల గోసను చూడలేక తల్లిదండ్రులే..కప్పుకోవటానికి చద్దర్లు..పెట్టెలు, తక్షణం కావాల్సిన నోట్‌ పుస్తకాలు కొని ఇస్తున్నట్టుగా తెలిసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన స్టడీ మేటీరియల్‌ ఎప్పుడొస్తాయా? అని ఎదురు చూస్తున్నారు.
సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం..
తాళ్ల నాగరాజు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలోని గురుకులాల్లో ఎక్కువ శాతం అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచటం లేదు. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. గురుకులాల సమస్యలు గుర్తించటంలో సర్కార్‌ మాటలకే పరిమిత మైంది. అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన లేదు. అద్దె వ్యవహారంలో అవినీతి జరుగుతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని నివత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గోరంత చేసి కొండంత చేసినట్టు ప్రచారం చేసుకోవటం వల్ల విద్యార్థులకు జరిగే ప్రయోజనం ఏమీ లేదు. ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహిస్తున్నాం. త్వరలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం.