నీరోను మించినోడు…

మన ఏలికల తీరు చూసినప్పుడల్లా నీరో చక్రవర్తి గుర్తుకువస్తాడు. అతని ఫిడేలు రాగాన్ని గురించీ చెప్పుకుంటాం. ఒకవైపు రోము తగలబడిపోవడం, రెండోవైపు సంగీత సాధన చేయటం. నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఎప్పుడూ చెప్పుకుంటున్న పాతపోలికే. ఫిడేలు వాయించుకోవడం, వ్యక్తిగత అభిరుచో, కళాపిపాస అనో, ఏదో కావొచ్చని రెండోవైపు నుంచి ఒకశాతం చెప్పుకోవచ్చేమో కానీ ఒకవైపు ప్రాణాలు పోతూ మంటలెగుస్తూవుంటే, తన అధికార రాజకీయ ఎత్తుల్లో, ప్రతిపక్షీయులను చిత్తుచేయడంపై తీరికలేకుండా తిరుగుతున్న మన అధినాయకుడి తీరు నీరోకన్నా మరీ దుర్మార్గంగా కనిపిస్తూ ఉన్నది. ఆయన ఆందోళనంతా రాబోయే 2024 ఎన్నికలలో తన గ్రాఫ్‌ తగ్గినదానిపైనే ఏకాగ్రమైవున్నది. ఒకవైపు తగ్గితే, ఇంకోవైపు పెంచుకోవటమెలాగోనని ప్రణాళికలు వేస్తూ తీరికలేకుండా ఉన్నారు. ఇలాంటి నాయకుడికి నీరో పోలిక కొద్దిగ తేలికైనదిగానే ఉందనిపిస్తుంది. ఇంకో దుష్టపోలికనేదో వెతుక్కోవాలేమో!
మణిపూర్‌లో గత రెండున్నర నెలలుగా మారణహౌమం జరుగుతోంది. రెండు బృందాల మధ్య చెలరేగిన విద్వేషంలో వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి. పచ్చని కొండలూ లోయలు గల రాష్ట్రంలో మంటలు చెలరేగుతున్నాయి. ఈ నాయకుడు ఆశిస్తున్న డబుల్‌ ఇంజిన్‌ సర్కారే ఆ రాష్ట్రంలోనూ ఉంది. చక్కదిద్ది చల్లబరచాల్సిన నాయకుడు అటువైపు చూడనుకూడా చూడడు. మాట్లాడడు. ప్రజల మధ్య పెరిగిన కక్షలను పోగొట్టి పరిష్కారం చేయాల్సింది ఎవరు! యాభైఆరు అంగులాల చాతీగల నాయకునికి ఆమాత్రం సామర్థ్యం లేదా! అక్కడ రెండు సమూహాల మధ్య సామాజిక వైరుధ్యం ఏర్పడింది. సంస్కృతిపరమైన వైవిధ్యాల కారణం, ఆర్థిక పరమైన వ్యత్యాసాలూ స్పర్థలకు తావిస్తున్నప్పుడు సావధానంగా పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు వాటిని మరింత పెంచి పోషించడం దీనికి ప్రధాన కారణం. అయితే ఇంకోవైపు దేశమంతా ఒకే విధమైన సాంస్కృతిక జీవనముండే విధంగా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకువస్తామని గొప్పలు చెబుతున్నారు. ఒక్క చిన్న రాష్ట్రంలో రెండు సమూహాల మధ్య వచ్చిన వివాదాన్ని, విధ్వంసాలు జరగకముందే పరిష్కరించలేని నాయకులు అనేక వైవిధ్యాలతో సంస్కృతులతో జీవనం సాగించేవారిని ఏకరూపంలో తెస్తామని చెప్పి, సాంస్కృతిక విద్వేషాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నీరో చక్రవర్తిలా నిర్లక్ష్యంగా ఉండలేదు, లక్ష్యం ప్రకారమే విధ్వంస రచన చేస్తున్నారు. వీరి నిర్లక్ష్యమూ లక్ష్యంలో భాగమే. విదేశాలకు తిరుగుతారు, ఉపన్యాసాలు దంచుతారు. పొగడ్తలకు ముసిముసిగా నవ్వుకుంటూ లోలోపలే ఆనందపడతారు. వాటన్నింటినీ ప్రచారం చేసుకుంటారు. కానీ దేశంలో అలజడి రేగుతున్న ప్రాంతాన్ని సందర్శించరు. రాజకీయంగా బలహీనమవుతున్న తమ పార్టీని బలోపేతం చేసుకోవటానికి దిశానిర్దేశం చేయటానికి తెలంగాణలోని వరంగల్‌ సభకు రావటానికీ, అందరితో మాట్లాడటానికి సమృద్ధిగా సమయముంటుంది. కానీ మణిపూర్‌ మాత్రం వెళ్లడు. తన అధికార, విద్వేష ప్రచారానికి తోడ్పడే సినీ ప్రముఖులనూ కలువగలుగుతాడు. మన్‌కీ బాత్‌లూ, ఫొటో షూట్‌లు అన్నీ చేయగలడు కానీ ప్రాణాలుపోతున్నా ఆవైపునకు తొంగిచూడడు. అబద్దాల కేరళస్టోరీని ప్రమోట్‌ చేస్తాడు కానీ ఆదివాసీ పేదపై అహంకారం మూత్రం పోస్తే మాత్రం మాటన్నా మాట్లాడడు. ఇక వరద బీభత్సంతో ఉత్తరాది అతలాకుతలమవుతుంటే, మన నాయకుడు విదేశీ వింధు భోజనాలలో తిరుగుతున్నాడు. ఢిల్లీలో వరద ముంచెత్తింది. యమున పొంగి ప్రవహిస్తోంది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌, హర్యానా, యూపీ, పంజాబ్‌ మొదలైన రాష్ట్రాల్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు రెండువందల మంది చనిపోయారు. వేలకోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగింది. నాయకుడెక్కడున్నాడు! ఏం చేస్తున్నాడు! ప్రజలంటే వారి బాధలంటే పట్టించుకోనివాడు నాయకుడెట్లా అవుతాడు! వారి పార్టీ అధ్యక్షులను మార్పుచేసుకుని ఎన్నికల కోసం సమాయత్తమవటమే ఆయన ముందున్న మొదటి కర్తవ్యంగా కనపడుతున్నది. కాబట్టి నీరో చక్రవర్తికి మించిన నాయకున్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎక్కడో మణిపూర్‌ రాష్ట్రంలో జరుగుతున్నది, మనకు చాలా దూరమని అనుకుంటే రేపు మనముందుకూ వస్తుంది. మణిపూర్‌ హింసను ఆపమని యురోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌ తీర్మానం చేసిందంటే పరిస్థితి ఎంత దాకావచ్చిందో అర్థం చేసుకోవాలి. దేశ ప్రజలంతా నిలదీసి అడగాలి. దేశానికి నేతగా ఎన్నుకోబడినవాడు సమస్యను పరిష్కరించేందుకు పూనుకోవాలి. కనీసంగా మాట్లాడాలి. ”ఈసారి అధికార పార్టీని ఓడించకపోతే దేశం మొత్తం మణిపూర్‌లా మండుతుంది” అని అన్న మాజీ గవర్నర్‌ సత్యపాల్‌మాలిక్‌ మాటలు అక్షర సత్యాలు. ఒకవైపు కొన్ని నెలలుగా మహిళా మల్లయోధులు తమకు న్యాయం కావాలని వేడుకున్నా ఉలుకూ పలుకూ ఉండదు. వరదలొచ్చి చస్తున్నా స్పందనుండదు. మంటల్లో ప్రాణాలు పోతున్నా తన రాజకీయం తనే చేసుకుంటూ పోతుంటే ఎవరు నన్ను ప్రశ్నిస్తారనే ధీమానా! ప్రశ్నిస్తారు. నిలదీస్తారు. నిలబడకుండా పక్కకు తోసేస్తారు.