దళితులకు 300యూనిట్ల ఉచిత విద్యుత్‌కోసం ఉద్యమం

300 units for Dalits Movement for free electricity– అక్టోబర్‌ 2నుంచి కేవీపీఎస్‌ ఆవిర్భావ వారోత్సవాలు : కేవీపీఎస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దళితులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ కోసం రాబోయే కాలంలో పోరాటాలు నిర్వహించనున్నట్టు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి స్కైలాబ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్టు పేర్కొన్నారు. 10ఏండ్లలో బీజేపీ అనుసరించిన మనువాద విధానాల ఫలితంగా దళితుల్లో అభద్రత పెరిగిందని విమర్శించారు. దళితులపై 300రేట్లు దాడులు పెరిగాయని పేర్కొన్నారు. ఢిల్లీ కేరళ తమిళనాడు రాష్ట్రాల తరహాలోనే మన రాష్ట్రంలో దళిత, గిరిజనులకు 300యూనిట్ల ఉచిత విద్యుత్‌ కొరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 342 జివో ప్రకారం దళిత గిరిజనులకు 101 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో లబ్ధిదారులు ఉచిత విద్యుత్‌ పొందలేక పోతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం నుంచే గ్రామాల్లో సర్వేలు,సెప్టెంబర్‌ 20నుంచి 25మధ్య మండల విద్యుత్‌ ఆఫీసుల వద్ద ధర్నాలు 28,29న జిల్లా విద్యుత్‌ ఆఫీసుల వద్ద ధర్నాలు చేపట్టనున్నట్టు తెలిపారు. కేవీపీఎస్‌ ఏర్పడి25ఏండ్లు నిండుతున్న సందర్బంగా అక్టోబర్‌ 2నుంచి9వరకు ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం కురుమయ్య, పాలడుగు నాగార్జున పల్లెర్ల లలిత, ఉపాధ్యక్షుడు నందిపాటి మనోహర్‌, డి రాధాకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తిప్పారపు సురేష్‌, కోట గోపి, ప్రకాష్‌ కారత్‌, డి రాం మూర్తి, రవికుమార్‌, దుర్గం దినకర్‌, వివిధ జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.