ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే అరెస్టు చేయాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు, టి.జ్యోతి
– మహిళా రెజ్లర్స్‌కు మద్దతుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ర్యాలీ
నవతెలంగాణ-ముషీరాబాద్‌
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు, టి.జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రెజ్లర్లు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిరసన తెలిపారు. హైదరాబాద్‌ గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ వరకు ప్రదర్శన నిర్వహిం చారు. అనంతరం సీపీఐ(ఎం) నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో డిజి.నర్సింహారావు, జ్యోతి మాట్లాడారు. మహిళా రెజ్లర్ల న్యాయమైన పోరాటానికి సీపీఐ(ఎం) పూర్తి మద్దతు తెలియజేస్తుందని చెప్పారు. ఎంపీని కాపా డుకునే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం.. దేశానికి ఖ్యాతి తెచ్చిన మహిళా రెజ్లర్లతో అవమానకర రీతిలో వ్యవహరిస్తున్నదన్నారు.
వారి ఆందోళనను అణచి వేసేందుకు పూనుకుంటుందని, కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిని నిరసించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపు నిచ్చారు. కె.నాగలక్ష్మి మాట్లాడుతూ .. 40 రోజులు గా ఢిల్లీ వీధుల్లో ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగే వరకూ సీపీఐ(ఎం) అండగా నిలుస్తుందన్నారు. సాటి క్రీడాకారులందరూ సంఘీ భావం తెలిపి మద్దతుగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మహేందర్‌ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర నాయకులు ఎం.శ్రీనివాసరావు, ఎం.వెంకటేష్‌, కేఎన్‌ రాజన్న, జి.నరేష్‌, ఎన్‌.మారన్న, సి.మల్లేష్‌ ఆర్‌.వెంకటేష్‌, జి.కిరణ్‌, అశోక్‌, ఎం.అజరు బాబు, ఆర్‌.వాణి, జె.కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి నారాయణగూడ ఫ్లైఓవర్‌ వద్దన కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎంపీ బ్రిజ్‌ భూషన్‌ శరణ్‌ సింగ్‌ను పార్లమెంటు సభ్యత్వం నుంచి అనర్హుడిగా ప్రకటించాలని నాయకులు డిమాండ్‌ చేశారు ఏఐటీయూసీ జాతీయ నాయకులు బి.వి.విజయలక్ష్మి, వి.యస్‌.బోస్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు యం.డి.యూసుఫ్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.