23న ఎంపీ వెంకట్‌రెడ్డి జన్మదినం

– స్వగ్రామం బీ.వెల్లెంల రిజర్వాయర్‌ కృష్ణమ్మ పాదాల చెంత వేడుకల వేదిక
– ఐదువేల ద్విచక్ర వాహనాలతో ర్యాలీ
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ కాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 60 వ జన్మదిన వేడుకలను ఈ పర్యాయం అట్టహాసంగా నిర్వహించేందుకు మండల పరిధిలోని స్వగ్రామం బీ.వెల్లెంల రిజర్వాయర్‌ కృష్ణమ్మ పాదాల చెంత వేడుకల వేదిక సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 23 నాటికి వెంకట్‌రెడ్డి 60వ ఏట అడుగుపెడుతున్నారు. స్వగ్రామం బీ.వెల్లెంల రిజర్వాయర్‌ కృష్ణమ్మ పాదాల చెంత వేడుకల వేదిక రైతు కుటుంబంలో జన్మించి ఒక రైతుగా రైతుల మనోవేదనను అర్థం చేసుకుని బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం, ప్రాజెక్టును రూపకల్పన చేసి ప్రాజెక్టు పూర్తి కోసం అహర్నిశలు కృషిచేసి పూర్తయిన సందర్భాన రైతులతో కలిసి కుటుంబ సభ్యుల మధ్య ఆనందం పంచుకోవాలని లక్ష్యంతో జన్మదిన వేడుకలను చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. దీనికి తోడు వచ్చే 6 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలను అట్టహాసంగా భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 30,000 మంది జనసమీకరణ చేసి వారి సమక్షంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన జన్మదిన కేక్‌ కట్‌ చేసేలా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
ఐదువేల ద్విచక్ర వాహనాలతో ర్యాలీ
23న హైదరాబాద్‌ నుంచి నార్కట్‌పల్లి చేరుకున్న అనంతరం సుమారు 5 వేల ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నడుమ రిజర్వాయర్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న వేదిక వద్దకు వెంకట్‌రెడ్డి చేరుకునేలా పార్టీ శ్రేణులు ప్లాన్‌ చేస్తున్నారు. తన రాజకీయ కలగా తపించే బ్రాహ్మణవెల్లెంల ఉదయసముద్రం ప్రాజెక్టు రిజర్వాయర్‌ తొలుత సందర్శించి కృష్ణాజలాలకు వెంకట్‌ రెడ్డి పూజలు చేయనున్నారు. అనంతరం వేదిక వద్ద కేక్‌ కట్‌ చేసి సభకు హాజరయ్యే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేడుకలకు భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలంతా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. వేసవి దృష్ట్యా సభకు వచ్చే కార్యకర్తలు, అభిమానులు ఇబ్బందులు పడకుండా సభాస్థలి వద్ద పెండెల్స్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. కోమటిరెడ్డి జన్మదిన వేడుకలకు భారీ ఏర్పాట్లు నిర్వహించి కాంగ్రెస్‌ కేడర్లో మరింత రాజకీయ ఉత్సాహం నింపాలని ఆయన భావిస్తున్నారు. జన్మదిన వేడుకలు జరిగే ప్రాంతంలో కాంగ్రెస్‌ నేతలు గుమ్ముల మోహన్రెడ్డి, బత్తుల ఊశయ్య ఆధ్వర్యంలో రెండు రోజులుగా వేదిక, సభాస్థలి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.