ఎంసెట్‌ బైపీసీ తుదివిడత కౌన్సెలింగ్‌ ప్రారంభం

–  20 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్‌ ఇంజినీరింగ్‌, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ బైపీసీ విద్యార్థులకు నిర్వహిస్తున్న తుదివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాసెసింగ్‌ ఫీజు, ధ్రువపత్రాల పరిశీలనకు 540 మంది స్లాట్‌ బుక్‌ చేసుకున్నారని తెలిపారు. ఈనెల 19న ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. ఆదివారం నుంచి ఈనెల 20 వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశముందని వివరించారు. ఈనెల 23న సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఇతర వివరాల కోసం https://tseamcetb.nic.in  వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.