హస్తం- పేదల నేస్తం : ములుగు ఎమ్మెల్యే సీతక్క

నవతెలంగాణ-గోవిందరావుపేట
హస్తం పేదల నేస్తం కాంగ్రెస్‌ పార్టీ అని, అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫి, క్వింటాల్‌కు రూ.500 బోనస్‌, రైతులకు ఏడాదికి రూ.15000, రైతు కూలీలకు రూ.12000, మహిళలకు ఉచిత బస్‌ సౌకర్యం, ప్రతి నెల మహిళకు రూ.2500 ఆర్థిక సహాయం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, గీతా కార్మికులు అందరికీ రూ.4000 చేయూత పెన్షన్‌, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యో గాలు భర్తీ చేస్తామని ములుగు ఎమ్మెల్యే డాక్టర్‌ ధనసరి సీతక్క అన్నారు. మంగళవారం మండలంలోని ఫ్రూట్‌ ఫారం సోమలగడ్డ, బొల్లెపల్లి, రాఘవపట్నం, పస్రా గ్రామాల్లో కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో జోరుగా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ నేను ఓట్ల కోసం వచ్చే నాయకురాలిని కాదని అన్నారు. అలాగే రాఘవ పట్నం గ్రామం నుండి 50 మందికి పైగా కాంగ్రెస్‌ పార్టీలో చేరగా ఎమ్మెల్యే సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవ సాయాన్ని పండుగ చేస్తామని సీతక్క తెలిపారు. లక్ష కోట్లతో దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్ట్‌ కట్టినమని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్‌ నాణ్యత ప్రమాణాలు లోపించి మూడేళ్లకే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ బీటలు వారడం కల్వకుంట్ల వారి అవినీతికి ప్రతీక అని అన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి మన తలాపున ఉన్న గోదావరి నీళ్లను తరలించడానికి కట్టిన ప్రాజెక్ట్‌ కూడా నాణ్యతతో కట్టకుండా లక్ష కోట్ల రూపాయలు దోచుకుపోయారని అన్నారు. బతుకులు మారుతాయని తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ ఇస్తే రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుని మనల్ని మోసం చేసిందని అన్నారు. ఇకనైనా మోస పూరిత వాగ్ధానాలు చేసే నాయకుల్ని నమ్మ వద్దని అన్నారు. ఈ దేశ స్వాతంత్య్రం కోసం పుట్టిన కాంగ్రెస్‌ పార్టీని, తెలంగాణ స్వరాష్ట్ర కలను తీర్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండని అన్నారు. ఆరు గ్యారంటీ పథకాలు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని హామీలు ఇచ్చి ప్రతి ఇంటికి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌చార్జిలు తేల హరిప్రసాద్‌ జెట్టీ సోమయ్య రాఘవపట్నం గ్రామ కమిటీ అధ్యక్షుడు కంటైం సూర్యనారాయణ గోవిందరావుపేట మండల జిల్లా నాయకులు, మండల నాయకులు, మండల అనుబంధ సంఘాల నాయకులు, యూత్‌ నాయకులు, మహిళా నాయకురాల్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.