మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

నవతెలంగాణ-మదనాపురం
కొత్తకోట కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న మున్సిపల్‌ సిబ్బందిని పర్మనెంట్‌ చేసి, కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని సీఐటీయూ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కమిషనర్‌కి వినతిపత్రం ఇచ్చి మాట్లాడారు. ఫిబ్రవరి 16న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమ్మె నిర్వహిస్తామని సమ్మెలో కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, ఎన్‌ఎంఆర్‌, ఫిక్స్డ్‌ పే కార్మికులను సైతం పర్మనెంట్‌ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులనుండే ప్రతినెల వేతనాలు చెల్లించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్మికులకు చెల్లిస్తున్నట్లుగానే తెలంగాణలో కూడా నెలకు రూ.24వేలు వేతనం చెల్లించా లని వెల్లడించారు. కొత్తగా నియమించుకున్న కార్మికులను పాత కార్మికులతో సమానంగా వేతనాలను ఇవ్వాలన్నారు. ప్రమాదంలో మరణిస్తున్న కార్మికులకు రూ.25లక్షలు ఇన్సూరెన్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టి, దహన సంస్కారాలకు రూ.30వేలు ఇవ్వాలని సూచించారు. మున్సిపల్‌ కార్మికుల పిల్లలకు ప్రత్యేక స్కాలర్షిప్‌ ఇచ్చి ఉన్నత చదువులకు ప్రోత్సాహం కల్పించాలన్నారు. కార్యక్రమం లో అధ్యక్షులు ఆనంద్‌ రాజు, కార్యదర్శి రమేష్‌, కొండన్న, కురుమన్న, బాల స్వామి, నోవేలు, కొండన్న, పెద్దరాజు, ప్రసాద్‌, మద్దిలేటి, శేఖర్‌, లక్ష్మి, సుశీల, సరళ, సుగుణమ్మ, దివ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు.