– మహబూబాబాద్ కోర్టు సంచలన తీర్పు
– బాధిత కుటుంబ సభ్యుల హర్షం
– పోలీసుల కృషి ప్రశంసనీయం : ఎస్పీ చంద్రమోహన్
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లాలోని కృష్ణ కాలనీలో 9 ఏండ్ల బాలుడు కుసుమ దీక్షిత్‌రెడ్డి హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. హంతకుడు మందసాగర్‌కు జడ్జి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ ఉరిశిక్ష విధించినట్టు జిల్లా ఎస్పీ జి.చంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం మహబూబాబాద్ టౌన్ పోలిస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు.
మహబూబాబాద్ మండలం శనిగపురం గ్రామానికి చెందిన మందసాగర్ పట్టణంలోని మూడు కోట్ల సెంటర్లో ఆటో మెకానిక్‌గా చేసేవాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన రంజిత్‌రెడ్డి కుమారుడు దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. 2020 అక్టోబర్ 18న సాయంత్రం 5గంటల సమయంలో మహబూబాబాద్ పట్టణంలోని కృష్ణ కాలనీలో ఉంటున్న జర్నలిస్ట్ కుసుమ రంజిత్‌రెడ్డి- వసంత దంపతుల కుమారుడు దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్ చేశాడు. సీసీ కెమెరాలు లేని ప్రాంతం నుంచి వెళ్లి తాళ్ళ పూసపల్లి వద్ద దానమయ్య గుట్టపైకి బాలున్ని తీసుకెళ్లాడు. అప్పటికే చీకటి పడుతుండగా బాలుడు భయపడి ఇంటికి వెళ్దామని చెప్పగా నిద్ర మాత్ర ఇచ్చాడు. మత్తులోకి జారుకోగానే బాలుని టీషర్ట్ విప్పి దాంతోనే ఉరేశాడు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అదే రోజు రాత్రి 10.30గంటలకు బాలుడి తల్లిదండ్రులు పోలిస్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ అరుణ్ కుమార్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నిందితుడు మందసాగర్ తన ఆనవాలు తెలియకుండా డింగ్ టోన్ అనే ఇతర దేశాలకు చెందిన యాప్‌ను ఉపయోగించి బాలుని తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. తానే కిడ్నాప్ చేశానని, రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అదే రోజు మహబూబాబాద్‌కు వస్తూ రంజిత్ రెడ్డికి మళ్లి ఫోన్ చేస్తే.. అతని భార్య వసంత ఫోన్ ఎత్తగా గొంతు మార్చి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇలా మూడ్రోజులపాటు హైడ్రామా సాగించాడు. దీంతో 21వ తేదీన కుసుమ రంజిత్‌రెడ్డి డబ్బులు, బంగారం తయారు చేసుకొని మందసాగర్ చెప్పినట్టుగా మూడుకోట్ల సెంటర్ వద్ద నిలబడ్డాడు. అది గమనించిన సాగర్ రంజిత్‌రెడ్డికి ఫోన్ చేసి పోలీసులకు ఎందుకు చెప్పావంటూ బెదిరించాడు. మళ్లీ సాయంత్రం తాళ్ళ పూసపల్లి దగ్గర ఉన్న స్టోన్ క్రషర్ మిల్లు వద్దకు రమ్మని చెప్పాడు. రంజిత్ రెడ్డి అదే మాదిరి చేసినా కూడా పోలీసులు ఉండటంతో మందసాగర్ వెళ్లిపోయాడు. ఈ కేసులో వరంగల్ కమిషనరేట్ నుంచి హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో సంప్రదించారు. ఇతర దేశాలకు చెందిన డింగ్ టోన్ యాప్ యాజమాన్యానికి ఫోన్ చేసి కాల్స్ రికార్డు ద్వారా నిందితుడు సాగర్‌ను గుర్తించి 22వ తేదీన అరెస్టు చేశారు. విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిలకమర్రి వెంకటేశ్వర్లు కేసు వాదించారు. చివరకు మందసాగర్‌కు జడ్జి ఉరిశిక్ష విధించారు. దీంతో బాలుని కుటుంబ సభ్యులు మానుకోటలో కోర్టు, పోలిస్‌స్టేషన్ ఎదుట బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. నిందితుని అరెస్టు చేయడంలో అప్పటి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి కీలక పాత్ర పోషించారని ఎస్పీ చంద్రమోహన్ తెలిపారు. పోలీసులు చెప్పే విధంగా నడుచుకుంటే బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. కేసులో కీలక పాత్ర పోషించిన సీఐలు రవి కుమార్, సతీష్ ఎస్ఐలు అరుణ్ కుమార్, వెంకటాచారి, కోర్టు కానిస్టేబుల్ సంపత్ రెడ్డి, మోహన్, లింగయ్య తదితరులను అభినందించారు.