సంగీతం.. జ్ఞాపకశక్తికి పదును పెడుతుంది

మణిపూర్‌లోని పాఠశాలకు వెళితే మన దగ్గరిలా కేవలం సాధారణ పాఠాలు మాత్రమే వినబడవు. ఉకులేల్‌ నుండి వచ్చే మధురమైన సంగీతం, పిల్లల శ్రావ్యమైన స్వరాలతో ప్రతిధ్వనించే అందమైన వాతావరణం మనల్ని మంత్ర ముగ్దులను చేస్తుంది. అద్భుతమైన సంగీతం కిండర్‌ గార్టెన్‌ను ఊహించని వేదికగా మారుస్తుంది. నిత్యం 30 మంది పిల్లల బృందం వేదికపై ప్రదర్శన ఇస్తూ ఆ సంగీత పాఠశాల తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ప్రస్తుతం ఈ కిండర్‌ గార్టెన్‌ కచేరీలు ‘బ్లోయిన్‌ ఇన్‌ ది విండ్‌’ వంటి అంతర్జాతీయ హిట్‌ల కంటే మించి విస్తరించి ఉన్నాయి.
నేర్చుకోవడానికి ఓ సాధనం
పామ్‌షోన్‌ ఇది సంగీత పాఠశాల అనే అపోహను తొలగించారు. ‘మేము విద్యార్థులకు అభ్యాస పాఠ్యాంశాల్లో భాగంగా సంగీతాన్ని అందించే కిండర్‌ గార్టెన్‌ పాఠశాల ఇది’ అంటున్నారు ఆమె. ఈ వెంచర్‌ స్థాపించక ముందు ఆమెకు రెండు దశాబ్దాల బోధనా అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే 2009లో దీన్ని స్థాపించారు. కిండర్‌ గార్టెన్‌ కేవలం వర్ణమాలను మాత్రమే నేర్పించదు. ఇక్కడ సంగీతం ప్రారంభ విద్యలోనే కలిసిపోతుంది. ‘బోధనలో నా అనుభవం నాకు నేర్పిన ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, నేర్చుకోవడానికి ఒక సాధనంగా సంగీతం తన ప్రత్యేకతను చాటుకుంది. సంగీతం పిల్లలు ఏదైనా వేగంగా నేర్చుకోవడానికి, వారి జ్ఞాపకశక్తికి పదును పెట్టడానికి సహాయపడుతుంది. ఇది మరింత సృజనాత్మకంగా, నిష్ణాతులుగా తయారు కావడానికి వారికి సహాయపడుతుంది’ అని పామ్‌షోన్‌ చెప్పారు. 2009 నాటికి వారి పట్టణంలో ఒక్క కిండర్‌ గార్టెన్‌ కూడా లేదు. ఇదే పామ్‌షోన్‌కు తన సొంత వెంచర్‌ను ప్రారంభించి, తన అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి సరైన అవకాశాన్ని అందించింది. సంగీత విద్యా నైపుణ్యం, ప్రత్యేకించి ఉకులేలేతో ఆమెకున్న అనుబంధం పాఠ్యాంశాల్లో దాని చేరికను ప్రేరేపించింది.
ఉకులేలే ఏబీసీలు
సంగీత తరగతులకు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మొదట్లో పామ్‌షోన్‌ తల్లిదండ్రుల నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అయినా ఆమె ఎంతో పట్టుదలతో ఉన్నారు. విద్యార్ధులు మెరుగైన సాఫ్ట్‌ స్కిల్స్‌, చదువులో కూడా చురుగ్గా ఉండడం, కొత్త విషయాలు నేర్చుకోవడంపై సానుకూల ప్రభావం పిల్లల్లో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఉకులేలే వాయించే కళ టీనేజ్‌ పిల్లలకు ఒక పరివర్తన ప్రయాణంగా మారింది. కిండర్‌ గార్టెన్‌లోని సంగీత ఉపాధ్యాయురాలైన ఖంథింగ్‌ షిమ్రే ప్రారంభంలో ఉకులేల్స్‌ను కొత్త విద్యార్థులకు నేర్పించే విషయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నారు. ‘వారు వాయిద్యాన్ని వాయించడం అలవాటు చేసుకోవడానికి రెండు నుండి మూడు నెలలు పడుతుంది. ఆ తర్వాత ఎంతో నైపుణ్యంగా ప్రదర్శించగలరు. వారిలో కొందరు పిల్లలకు చాలా అధునాతనమైన ట్యూన్‌ ఇచ్చినా అద్భుతంగా వాయించగలుగుతున్నారు’ అని ఆమె వివరించారు.
సోషల్‌ మీడియా ద్వారా…
జూలై 2022లో సోషల్‌ మీడియాలో ఒక వీడియో ద్వారా స్పాట్‌లైట్‌ పామ్‌ కిండర్‌ గార్టెన్‌ గురించి ఈ ప్రపంచానికి తెలిసింది. ‘మంగనుయిషోన్‌ (నాట్‌ యంగ్‌ ఫరెవర్‌)’ అనే పాటలను పిల్లలు ప్రదర్శించారు. వాస్తవానికి పద్మశ్రీ గ్రహీత రెవ్బెన్‌ మషాంగ్వా ఈ పాట పాడారు. ఇందులో నింషింఫీ ముయివా కూడా ఉన్నారు. అప్పటి నుండి వారి సంగీత ప్రయాణం వివిధ వేదికలను అలంకరించింది. ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. హూపింగ్‌, బౌన్స్‌ పిల్లలతో కలిసి పాడుతున్నప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. అలాగే ఈ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి 2019లో 10 ఏండ్ల వయసులో S Horyaowon Pheirei “Sansa’s Got Talent ని గెలుచుకోవడంతో స్థానికంగా మంచి గుర్తింపు వచ్చింది. ఇది వీరికి మరెన్నో అవకాశాలు కల్పిస్తుంది.
బోధనా సిబ్బంది వల్లనే
పామ్‌షోన్‌ ప్రధానంగా స్థానిక పాటలను బోధించడంపై దృష్టి సారిస్తారు. పిల్లలు వాటిని నేర్చుకోవడం సులభం అని ఆమె నమ్ముతున్నారు. ‘మాంగనుయిషాన్‌’, ఫెదర్‌హెడ్స్‌ హిట్‌ పాట ‘ఇహావో థాట్‌’ వంటి వారి ఇష్టమైన ప్రదర్శనలు యువతతో పాటు పాత తరాలకు స్ఫూర్తినిచ్చే సందేశాలను కలిగి ఉన్నాయని ఆమె అన్నారు. కిండర్‌ గార్టెన్‌ ఇటీవల ‘ఇహావో థాట్‌’ అనే కవర్‌ వీడియోను విడుదల చేసింది. పాట ఎంపికల గురించి అడిగితే ‘మేము ఈవెంట్‌లలో ప్రదర్శన ఇస్తునపుడు సాధారణంగా నిర్వాహకులు మమ్మల్ని కొన్ని పాటలు పాడమని కోరుకుంటారు. వాటితో పాటు మేము ఇతర ప్రసిద్ధ పాటలతో పాటు సందేశాలను ఇచ్చే పాటలను కూడా పాడతాము. సంగీతం, అధ్యయనాల మధ్య సున్నితమైన సమతుల్యతను కొనసాగిస్తున్న ఆమె ఇది కేవలం తన బోధనా సిబ్బంది వల్లనే సాధ్యమయిందని సగర్వంగా చెబుతున్నారు.
సంగీతం కూడా…
‘మా సంగీత తరగతులు మిగిలిన క్లాసులు పూర్తయిన తర్వాత నిర్వహిస్తాము. కాబట్టి సాధారణ తరగతులకు అంతరాయం ఉండదు. మేము విద్యార్థులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తాం. తద్వారా వారు సంగీతంతో పాటు విద్యావిషయాలలో కూడా పురోగతి సాధిస్తారు’ అని ఆమె చెప్పారు. పామ్‌షోన్‌ సంప్రదాయ మార్గాలకు మించి విద్యార్థుల పరిధులను విస్తృతం చేయాలని భావిస్తున్నారు. ‘ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే మంచిగా బతకగలం అని నేటికీ చాలా మంది భావిస్తున్నారు. అవి రాకపోతే ఇక జీవితమే లేనట్టు బాధపడుతున్నారు. కానీ జీవితంలో ఇతర మార్గాలు ఉన్నాయని, సంగీతం కూడా అందులో ఒకటి అని విద్యార్థులకు తెలియజేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము’ అని ఆమె అంటున్నారు.