తన కండ్ల ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, తనకు కన్నీళ్లు తెప్చించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి, ఆ అనుభవాలను కథలుగా రాయడం మొదలుపెట్టిన వర్థమాన రచయిత్రి
రోహిణి వంజారి.
సుమారు 70 కథల వరకు రాసి, తన మొదటి కథా సంకలనం ‘నల్ల సూరీడు’తో కథకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
నైతిక విలువలు కాపాడుకోవాలి
ఆధునిక పోకడలు అనుక్షణం మనల్ని చుట్టేస్తున్నాయి. అయినా మనిషిగా మనలోని నైతికతను మాత్రం మనం మర్చిపోకూడదు. ఓ రచయిత్రిగా ఈ బాధ్యత నాపై ఉందనుకుంటాను. మన పిల్లలకి మనం ఆ విలువలను అందించాలి. ఏ సంఘటన జరిగినా ప్రతిస్పందిస్తూ అందరూ సంతోషంగా ఉండేందుకు రచయిత్రులు పాటు పడాలి. కులం, మతం, ప్రాంతం పేరుతో విభేదాలు సృష్టించుకోవద్దు. అలాగే జరిగిన విషయాలను, నిజాలను నిజాయితీగా వెల్లడించాలి.
అగ్ని పర్వతం బద్దలై
నేను చూసి చలించిన సంఘటనలు, నాకు తెలిసిన విషయాలను కథలుగా రాస్తున్నాను. నా ఆవేదనలు శ్వేత పత్ర భూమిలో నల్లటి అక్షర బీజాలుగా మారి సాహితీ వనంలో నేనొక చిన్న మొక్కగా మొలకెత్తుతానని కలలో కూడా ఊహించలేదు. అలాంటిది నాకు నేనుగా తెలుసుక్ను విషయాలు, పొందిన సంవేదనలు, పడిన అవేదనలు, కడుపులో దాచుకుని, ఇక అగ్నిపర్వతం గర్భంలో బద్దలై లావాలా పెల్లుబకాల్సిందే అన్నట్టు, రాయకుండా ఉండేలని కొన్ని పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఇక ఉండబట్టలేక రాయడం మొదలుపెట్టాను.
రోహిణి పుట్టింది, పెరిగింది నెల్లూరు పట్టణంలో. విద్యాభ్యాసం మొత్తం అక్కడే కొనసాగింది. తల్లి ఆదిలక్ష్మి, తండ్రి అరిశా సత్యనారాయణ. ఈయన మొదట్లో గ్రామంలో ఉండి మూడు ఎకరాల సొంత పొలంలో వ్యవసాయం చేసేవారు. నష్టాలతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. దాంతో నెల్లూరు వచ్చి ఓ బి.ఎడ్ కాలేజీలో మొదట గుమస్తాగా చేసేవారు. ఆ తర్వాత తన ఉద్యోగం లైబ్రరీకి మారింది. అక్కడి బొమ్మల పుస్తకాలను పిల్లలకు చూపించడానికి అప్పుడప్పుడు ఇంటికి తీసు కొచ్చేవారు. అలా రోహిణికి పుస్తకాలతో పరిచయం.
చదవడం వ్యసనంగా మారింది
రోహిణి హైస్కూల్లో ఉన్న ప్పుడు తన మేనత్త శమంతక మణి కథల పుస్తకాలు, నవలలు అద్దెకు తెచ్చుకుని చదువుకునే వారు. ఆమె ప్రభావంతో చదవడం మొదలు పెట్టారు. పక్కింటికి వచ్చే పత్రికలను కూడా చదివే వారు. అలా చదవడం ఆమెకు ఓ వ్యసనంగా మారిపోయింది. అది ఎంతగా అంటే కాలేజీకి వచ్చిన తర్వాత వెళ్ళే దారిలో పెద్ద లైబ్రరీ ఉండేది. కాలేజీ పూర్తి చేసుకున్న తర్వాత ఆ లైబ్రరీలో గంటల తరబడి కూర్చొని పుస్తకాలు చదువుతుండేవారు. అక్కడే ఆమె చాలా పుస్తకాలు చూడగలిగారు, చదవగలిగారు. అప్పట్లో వచ్చే వార పత్రికలన్నీ వదలకుండా చదివేవారు. బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది’, కన్యాశుల్కం, రావిశాస్త్రి నవలలు ఆ లైబ్రరీలోనే చదవారు.
సంఘర్షణలు మొదలయ్యాయి
విస్తృతంగా చదవడం అలవాటైన ఆమెకు ఆ రచనలతో పాటు చుట్టూ ఉన్న వ్యక్తులను, జరుగుతున్న సంఘటలను, పరిస్థితులను చూసే కొద్దీ మనసులో ఏవేవో సంఘర్షణలు మొదలయ్యాయి. ఈ ఘర్షన నుండే రాయడం మొదలుపెట్టారు. అప్పట్లో తను చూసి, చలించిన సంఘటనలను 1999లో ‘అభాగ్యుడు’ అనే కవిత రాశారు. అది ఓ పత్రికలో అచ్చయ్యింది. స్పందనగా 15 ఉత్తరాలు వచ్చాయి. ఆ స్ఫూర్తితో మరికొన్ని కవితలు రాశారు. ఆ తర్వాత పెండ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలు పెరిగాయి. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాతనే బి.ఎడ్ కూడా చేశారు. ఆ తర్వాత ప్రైవేట్ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా ఉద్యోగం. ఇలా ఆమెకు క్షణం తీరిక ఉండేది కాదు. అలా దాదాపు పదిహేనేండ్లు గడిపేశారు.
మళ్ళీ రాయాలనే ఉత్సాహం
రాయడం ఆపేసినా చదవడం మాత్రం మానలేదు. వార పత్రికల్లో వచ్చే నవలలు కచ్చితంగా చదివేవారు. అలా 2012లో ఓ సీరియల్ నవల ముగింపు సందర్భంగా పాఠకులకు పోటీ పెట్టారు. అందులో రోహిణి కూడా పాల్గొని మూడవ బహుమతి పొందారు. దాంతో ఆమెలో మళ్ళీ రాయాలనే ఉత్సాహం వచ్చింది. అయితే అదే ఏడాది భర్త వ్యాపారంలో నష్టాలు వచ్చి కోలుకోలేని దెబ్బ తగిలింది. దాంతో బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చేశారు. అప్పటి వరకు నెల్లూరు తప్ప ఏమీ తెలియని ఆమెకు మహానగరం కొత్త ప్రపంచంలా అనిపించింది. తాను పని చేసిన స్కూల్ టీచర్లు, యాజమాన్యాల తీరుపై స్పందించి ‘సూపర్ టీచర్ సిండ్రోమ్’ అనే కథ రాశారు. ఇది నవ్య వారపత్రికలో వచ్చింది. ఇదే ఆమె తొలి కథ. అలా మొదలైన కథా రచన 2016 తర్వాత మరింత విస్తృతమయింది.
ఇతరులతో పంచుకోవాలని
రోహిణి తన జీవితంలో వింతగా, బాధగా, ఆవేదన అనిపించిన సంఘటనలను ఎన్నో చూశారు. వీటిపై ఎంతసేపూ మనలో మనమే మదన పడడం కన్నా ఇతరుతో పంచుకోవడం మంచిదనుకున్నారు. ఇతరులకు చెబితే ఒకరితోనో ఇద్దరితోనో చెప్పగలం. అదే కథగా రాస్తే చాలా మంది చదువుతారు, తెలుసుకుంటారు. అందుకే ఆ సంఘటనలను కథగా రాయడం ప్రారంభించారు. అలా రాసిన మరో కథ ‘ఆసరా’. దీనికి బహుమతి కూడా అందుకున్నారు. దళితుల పట్ల సమాజం చూపిస్తున్న వివక్షకు స్పందించి ‘నల్ల సూరీడు’ అనే మరో కథ రాశారు.
మార్పు రావాలని
ఇప్పటికి సుమారు 75 కథలు రాశారు. ఇవన్నీ అనేక పత్రికల్లో వచ్చాయి. చాలా వరకు బహుమతులు కూడా తెచ్చిపెట్టాయి. వీటిలో కొన్ని ఓ సంపుటి తీసుకురావాలనే ఉద్దేశంతో ‘నల్ల సూరీడు’ తీసుకొచ్చారు. ఓ రచయిత్రిగా తనకు పేరు రావడం కంటే, తన రచనలు చూసి ఏ ఒక్కరిలోనైన మార్పు రావాలని ఆమె కోరిక. అవసరమైన, ఆపదలో ఉన్న వారికి తమకు తోచిన చేయూత అందిస్తారని ఆమె ఆశ. అలాగే రోహిణి మీ టు, కంచె అనే స్త్రీ వాద కథలు కూడా రాశారు. వాటిని కూడా త్వరలో మరో సంపుటిగా మన ముందుకు తీసుకురాబోతున్నారు. అలాగే తాను నెల్లూరులో ఉన్నప్పుడు చూసిన సంఘటనలతో ‘విజయమహల్ సెంటర్’ పేరుతో మరో కథా సంకలనం తీసుకురాబోతున్నారు. తన కవితలతో కూడా మరో పుస్తకం తీసుకురావాలని యోచిస్తున్నారు.
కుటుంబ సహకారంతో…
రోహిణి భర్త కృష్ణమూర్తి సీరియల్ ఆర్టిస్ట్. ప్రస్తుతం ‘బ్రహ్మముడి’ అనే సీరియల్‌లో చేస్తున్నారు. ఈయనకు చిన్నప్పటి నుండి పరిషత్ నాటకాల్లో చేసిన అనుభవం ఉంది. పెండ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతోనే బి.ఎడ్ పూర్తి చేశారు. రాయడం మొదలుపెట్టారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే కూతురు వైష్ణవి ఆమె కథలకు మొదటి పాఠకురాలు. ఇక కొడుకు చైతన్య, కోడలు సాహిత్య ఈమెకు అన్ని విషయాల్లో అండగా నిలబడుతున్నారు.
– సలీమ
జీవన సంఘర్షణలే నా కథలు
10:48 pm