సీఎం కేసీఆర్‌కు నాగం ప్రశ్న

–  పాలమూరు ప్రజలకు తలవంచి క్షమాపణ చెప్పాలని డిమాండ్
–  కృష్ణా జలాల జలదోపిడీపై మౌనం ఎందుకు?
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పూర్తి కాని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేయటమేంటని టీపీసీసీ సీనియర్‌ నేత నాగం జనార్ధన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. సొంత జిల్లా నేతలే ప్రాజెక్టును అడ్డుకున్నారన్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు తాను అడ్డుపడ్డట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు. ఒకవేళ నిరూపించకపోతే కేసీఆర్‌ ఏం చేస్తారని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి జి చిన్నారెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. 30 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి 90 నెలలైనా పూర్తి చేయలేదని విమర్శించారు. పాలమూరు నిర్వాసితులకు దేశ చరిత్రలో ఎరుగని పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్‌ మోసం చేశారని విమర్శించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తల నరుక్కుంటానన్న కేసీఆర్‌ ఇప్పుడు ఏం చేస్తారని నిలదీశారు. మాట తప్పినందుకు తల వంచి పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు మొత్తంలో 31 పంపులకు గానూ కేవలం ఒక పంపు మాత్రమే వెట్‌ రన్‌ చేస్తున్నారని తెలిపారు. ఇంత మాత్రానికే బీఆర్‌ఎస్‌ నేతలు మసి పూసి మారేడుకాయ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వట్టెం జలాశయం కోతకు గురైతే 50కి పైగా గ్రామాలు కొట్టుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం పేరుతో ప్రభుత్వ నిధులతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయంగా డ్రై రన్‌ చేపట్టిన నెల రోజుల తర్వాత వెట్‌ రన్‌ నిర్వహించాలని చెప్పారు. ఆగ మేఘాల మీద 13 రోజులకే వెట్‌ రన్‌ ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిపై చూపిన శ్రద్ధ పాలమూరు రంగారెడ్డిపై ఎందుకు చూపట్లేదని ప్రశ్నించారు.