సిబ్బంది రిక్రూట్ చేయని నారాయణపురం విద్యుత్ సబ్ స్టేషన్

నవతెలంగాణ – అశ్వారావుపేట
దశాబ్ది ఉత్సవాలు పేరుతో అన్ని ప్రభుత్వ శాఖలు నాడు – నేడు ప్రగతి పేరుతో విజయోత్సవాలు జరుపుతున్నాయి. విజయవంతం చేస్తున్నాయి. కానీ నాటికి నేటికి సదుపాయాలు మెరుగైన మాట ఎంత వాస్తవమో మానవ వనరులను అభివృద్ది పరచడంలో మాత్రం సగానికి సగం వెనుక ఉన్నాం అనేది అంతే నిజం. పెరిగిన విద్యుత్ వినియోగం అనుగునంగా సబ్ స్టేషన్ లు నిర్మించారు,లైన్ లు విస్తరించారు,విద్యుత్ సరఫరా సామర్ధ్యం పెంచారు.కానీ క్షేత్రం స్థాయిలో వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి అవసరం అయిన సిబ్బంది నియామకాలు చేపట్టడంలో మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు.అరకొర సిబ్బంది కారణంగా చిన్నపాటి గాలి సోకినా విద్యుత్ అంతరాయం ఏర్పడి సరఫరాకు గంటలు సమయం పడుతుంది.ఒక పక్క సిబ్బంది కొరత తీవ్రంగా ట్రాన్స్ కో జెన్ కో లను వేధిస్తుంది. అశ్వారావుపేట మండలంలో 400 మెగావాట్ల స్టేషన్,33 కే.వీ సబ్ స్టేషన్ 5 ఉన్నాయి.ఇందులో అశ్వారావుపేట,వినాయకపురం సబ్ స్టేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మించి ప్రభుత్వం పరంగా నిర్వహిస్తుండగా నారంవారిగూడెం,గంగారం,నారాయణపురం ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహిస్తున్నారు.
ఒక్కో సబ్ స్టేషన్ కు ఒక వాచ్ మేన్ తో సహా మరో నలుగురు ఆపరేటర్ అవసరం ఉంటుంది.క్షేత్రస్థాయి సిబ్బంది అందకు అనుగుణంగా ఉండాలి. ఈ అయిదు సబ్ స్టేషన్ లు పరిధిలో మొత్తం 25 మంది సిబ్బంది నిరంతరం సేవలు అందించాలి.కానీ ప్రస్తుతం మండలం మొత్తం 12 మంది మాత్రమే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలనే నారాయణపురం లో సబ్ స్టేషన్ నిర్మించి,ప్రారంభించారు.అయినా ఇక్కడ విధులు నిర్వహించడానికి సిబ్బందిని పోస్ట్ లు మంజూరీ చేయలేది.ఉద్యోగులను రిక్రూట్ చేయలేదా.దీంతో ఈ అరకొర ఉన్న సిబ్బందిని,మరికొందరిని అనధికారికంగా అక్కడ విధులు నిర్వహిస్తున్నారు.ఈ ఉన్న సిబ్బందిలో అత్యధికులు ఆర్టిజెన్ సిబ్బంది కావడం. ఇప్పటికైనా సిబ్బందిని నియమించి నిరంతరం నాణ్యమైన సేవలు అందేలా విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు.