‘నారీశక్తి’ ఎన్నికల జిమ్మిక్కు

'Narishakti' is an election gimmick– 2024 ఎన్నికల్లోనే అమలు చేయాలి
– నియోజకవర్గాల పునర్విభజన, జనగణనతో ముడిపెట్టడం సరిగాదు :మహిళా సంఘాల నేతలు
– మల్లు లక్ష్మి, ఎన్‌.జ్యోతి, వి.సంధ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నారీశక్తి పేరుతో పార్లమెంట్‌లో మోడీ సర్కారు ప్రవేశపెట్టిన మహిళా బిల్లు ఎన్నికల జిమ్మిక్కు అని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఎస్‌ఎఫ్‌డబ్ల్యూ ప్రధాన కార్యదర్శి ఎన్‌.జ్యోతి, పీఓడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి వి.సంధ్య విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను 2024 ఎన్నికల నుంచే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలును జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం సరిగాదన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు-మహిళా సంఘాలు కోరేదేమిటి? అనే అంశంపై వెబినార్‌ నిర్వహించారు. దీనికి ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల నేతలు మాట్లాడుతూ..2027 తర్వాత అమలు అంటే మహిళలను మరోమారు మోసం చేయడమే అని విమర్శించారు. మహిళలు ఎదగాలంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం కల్పించాలని 1974లోనే వీణా మజుందార్‌ నేతృత్వంలో వేసిన కమిటీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం కమ్యూనిస్టు నాయకురాలు గీతాముఖర్జీ చేసిన పోరాటాన్ని వివరించారు. మహిళల హక్కులే మానవ హక్కులని బీజింగ్‌ డిక్లరేషన్‌ జరిగిందని గుర్తుచేశారు. మన దేశంలో మాత్రం పాలకులు మహిళలను రాజకీయంగా ఎదగకుండా తొక్కిపెట్టారన్నారు. మహిళా బిల్లు తెరపైకి వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక అంశంతో ముడిపెట్టి వెనక్కి లాగుతున్న తీరును వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పుట్టుపూర్వోత్తరాలు చూస్తే మహిళలకు సభ్యత్వం ఇవ్వడానికే నిరాకరిస్తున్నదనీ, అది మనువాద సిద్ధాంతంతో ముందుకెళ్తున్నదని విమర్శించారు. కరుడుగట్టిన పితృస్వామ్య వ్యవస్థనే మహిళా బిల్లును తొక్కిపెడుతున్నదన్నారు. మహిళా ఓటు బ్యాంకును కొల్లగొట్టాడానికి ఆడుతున్న రాజకీయ క్రీడలో భాగమే ఈ బిల్లు అన్నారు. ఓబీసీ, మైనార్టీలకు సీట్ల కేటాయింపుపై చర్చే లేదన్నారు. దేశంలో తొమ్మిదేండ్ల కాలంలో నిరుద్యోగం, పేదరికం తీవ్రస్థాయికి చేరాయనీ, దళితులు, మహిళలపై దాడులు తీవ్రమయ్యాయని తెలిపారు. మణిపూర్‌లో మహిళలపై లైంగికదాడులు, హథ్రాస్‌ ఘటన, ఢిల్లీలో లైంగిక దాడులను నిరసిస్తూ రెజ్లర్ల ఆందోళనలతో మోడీ సర్కార్‌పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. ఇండియాలో మానవ హక్కులు హరించబడివేయబడుతున్నాయని వియత్నాంలో బైడెన్‌ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. వాటిని కప్పిపుచ్చుకునేందుకు వేసిన ఎన్నికల స్టంటే మహిళా బిల్లు అని విమర్శించారు. బలం లేకున్నా అనేక బిల్లులను ఆమోదించచేసుకున్న మోడీ సర్కారు మహిళా బిల్లును తొమ్మిదేండ్లుగా నాన్చుతూ వచ్చిందన్నారు. ఇప్పుడు ఆమోదం పొందిన బిల్లులోనూ అనేక లోపాలున్నాయని తెలిపారు. ఓబీసీ, మైనార్టీ, గిరిజనులు, ఎస్సీల వాటా తేల్చకుంటే దొరల చేతుల నుంచి పాలన దొరసానుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం కోసం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామన్నారు. బిల్లు పాసైంది కాబట్టి ఈ ఎన్నికల్లోనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ బిల్లులోని జనగణన క్లాస్‌ను తీసేయాలనే డిమాండ్‌తో మహిళా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఐక్య పోరాటాలు చేస్తామన్నారు. అక్టోబర్‌ ఐదో తేదీన ఐద్వా ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మల్లు లక్ష్మి తెలిపారు.