రేపు హైదరాబాద్‌లో చేనేత కార్మికుల జాతీయ కన్వెన్షన్‌

National convention of handloom workers in Hyderabad tomorrow– పలు రాష్ట్రాల నుంచి 200కిపైగా ప్రతినిధుల హాజరు
– కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే సంక్షోభంలో చేనేత రంగం
– మగ్గమున్న ప్రతి కార్మికునికి రూ.10 లక్షల చేనేత బంధు ఇవ్వాలి : తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత చేనేత కార్మికుల జాతీయ కన్వెన్షన్‌ ను ఈ నెల 22న నిర్వహించనున్నట్టు తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ప్రకటించారు. ఆయా రాష్ట్రాల నుంచి 200కిపైగా ప్రతినిధులు హాజరుకానున్నా రని చెప్పారు. ఈ కన్వెన్షన్‌లో చేనేత కార్మికుల స్థితిగతులు, చేయాల్సిన పోరాటాలపై చర్చిస్తామనీ, చేనేత రంగాన్ని బతికించుకునేందుకు దేశవ్యాప్తంగా పోరాడేందుకు జాతీయ స్థాయిలో ఒక స్టీరింగ్‌ కమిటీ వేస్తామని చెప్పారు. మగ్గం ఉన్నప్రతి చేనేత కార్మికునికి రూ.10 లక్షల చేనేత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. చేనేత రంగంపైనా, ముడి సరుకులు(రసాయనాలు, నూలు, జరీ, తదితరాలు)పై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. జాతీయ కన్వెన్షన్‌ను పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌లోని ఎస్వీకేలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లనే దేశవ్యాప్తంగా చేనేత రంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు. కేంద్రంలో మోడీ సర్కారు వచ్చాక కార్పొరేట్‌ కంపెనీలకు మేలు చేస్తూ పోవడం వల్ల చేనేత రంగం మరింత దివాళా తీసిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ చేనేత సంక్షేమ బోర్డును రద్దు చేసిందనీ, మహాత్మాగాంధీ బునకర్‌ బీమాయోజన, ఐసీఐసీఐ లాంబాడ్‌ హెల్త్‌ స్కీం, హౌస్‌ కం వర్క్‌ షెడ్‌ లాంటి కేంద్ర పథకాలను తొలగించిందని విమర్శించారు. 11 రకాల చేనేత రిజర్వేషన్‌ చట్టాల్ని తొక్కి పెట్టిందనీ, అందులో ఇప్పుడు ఐదారు అంశాలనే అమలు చేస్తున్నదని తెలిపారు. దేశంలో చేనేత రంగానికి పునర్జీవనం తీసుకురావా లంటే జాతీయ చేనేత సంక్షేమ బోర్డును పునరుద్దరించాలనీ, బడ్జెట్‌లో చేనేత, టెక్స్‌టైల్‌ రంగాలకు వేర్వేరుగా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. పవర్‌లూమ్‌, మిల్లులను తట్టుకుని చేనేత బతికేందుకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా చేనేత కార్మికులకు సమగ్రమైన పాలసీ తీసుకురావా లని డిమాండ్‌ చేశారు. సంక్షేమ పథకాలను అందజేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు తొమ్మిదేండ్ల నుంచి ఎన్నికలు నిర్వహించకుండా వాటిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వాటికి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ మాట్లాడుతూ..ఈ కన్వెన్షన్‌లో సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత, కోశాధికారి ఎం.సాయిబాబు, కార్యదర్శి ఆర్‌. కరిమలయన్‌, తదితర జాతీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో ఆశా, అంగన్‌వాడీ, మిడ్‌ డే మీల్స్‌ కార్మికులు, తదితర ప్రభుత్వ పథకాల సిబ్బందికి చేనేత బట్టలు అందజేసి ఆ రంగంలోని కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. సమావేశంలో చేనేత కార్మిక సంఘం గౌరవ సలహాదారులు కూరపాటి రమేశ్‌, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్‌ పాల్గొన్నారు.