– రెండో దశ ఉద్యమం కార్యాచరణకు ఎస్‌కేఎం, ఏఐఏడబ్ల్యూయూ పిలుపు
– వరద ముంపునకు గురైన ప్రాంతాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్
– లఖింపూర్ ఘటనకు బాధ్యుడైన మంత్రిని బర్తరఫ్ చేయాలని అక్టోబర్ 3న ధర్నాలు
– నవంబర్ 26, 27, 28 రాష్ట్ర రాజధానుల్లో మహా పడావ్
గువహతి : కార్మిక, కర్షక ఉద్యమాలే కార్పొరేట్ మతోన్మాద బీజేపీని ఓడిస్తాయని, ఎస్‌కేఎం రెండో దశ ఉద్యమానికి రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు సిద్ధం కావాలని ఎస్‌కేఎం, ఏఐఏడబ్ల్యూయూ పిలుపునిచ్చాయి. అసోం రాజధాని గువహతిలో జరిగిన సదస్సులో ఎస్‌కేయం జాతీయ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు హన్నన్ మొల్లా, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మాట్లాడారు. వరద ప్రాంతాలను జాతీయ విపత్తుగా ప్రకటించి.. రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎస్‌కేయం రెండో దశ దేశవ్యాప్త ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. లఖింపూర్ ఘటనకు బాధ్యుడైన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని అక్టోబర్ 3న, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26, 27, 28 తేదీల్లో వేలాది మందితో అన్ని రాష్ట్రాల రాజధానుల్లో మహాపడావ్ నిర్వహించడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎస్‌కేయం నిర్వహించిన సదస్సుకు నిర్వాసిత యువ రైతులను నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. 1000 మంది సీటింగ్ కెపాసిటీ కలిగిన ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న అభ్యుదయ సంఘాల ప్రతినిధులు అందరూ ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
జీడీపీలో 50 లక్షల కోట్ల పైన వ్యవసాయ రంగం నుంచే ఆదాయం సమ కూరుతుందనీ, దీనిపై కార్పొరేట్ శక్తుల ఆదిపత్యం చెలాయించేందుకే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ చేసే విధానాలను బీజేపీ ముందుకు తెస్తున్నదని విమర్శించారు. రైతులు ఉపయోగించే వ్యవసాయ కరెంటు మోటార్లకు మీటర్ల బిగించి రైతుల నుంచి బిల్లులు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచుతుందని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పని కల్పన నుంచి తప్పించుకోవడం కోసమే బడ్జెట్‌లో నిధులను నాలుగు శాతం నుంచి 1.37శాతానికి తగ్గించారని తెలిపారు.
సున్నితమైన అసోం లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశ భద్రతకు ప్రమాదంగా మారుతున్నాయి. మణిపూర్‌లో మంటలు ఆరిపోకుండా ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. అసోంలో డీలిమిటేషన్, ఎన్‌సీసీ లాంటి మతోన్మాద ఏజెండాలను అమలు చేయడం ద్వారా ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వాస్ అడ్డూ అదుపూ లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా రెచ్చగొట్టేటట్లు మాట్లాడుతున్నారనీ, బీజేపీ దుష్టపన్నాగాలను ప్రజలు గమనిస్తున్నారని వాటిని తిప్పి కొట్టడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు. బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళల పైన ప్రభుత్వాల మద్దతుతోనే దాడులు, హత్యలు, లైంగికదాడులు జరుగుతున్నాయని చెప్పారు.