– ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూకృష్ణన్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ వచ్చేనెల మూడున దేశవ్యాప్తంగా ‘బ్లాక్ డే’ నిర్వహిస్తున్నట్టు అఖిల భారత రైతుసంఘం (ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి విజ్జూకృష్ణన్ పిలుపునిచ్చారు. ఆదివారం కలకత్తాలో ఏఐకేఎస్ జాతీయ సమావేశాలను ఆ సంఘం జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్జూ కృష్ణన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. కనీస మద్దతు ధరల చట్టం, రుణ విమోచన చట్టం చేయలేదని చెప్పారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించలేదని అన్నారు. నలుగురు రైతులు, విలేకరి మరణానికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆశిష్ కుమార్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రైతాంగంపై అక్రమంగా బనాయించిన కేసులను ఉపసంహరించాలని కోరారు. ఈ అంశాలపై వచ్చేనెల మూడున దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించాలని ఆయన పిలుపు నిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేశంలోని అన్ని రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
నవంబర్ 27 నుంచి దేశవ్యాప్త నిరవధిక ధర్నాలు
నవంబర్ 26,27,28 తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర కేంద్రాల్లో నిరవధిక ధర్నాలు నిర్వహించాలని విజ్జూకృష్ణన్ పిలుపునిచ్చారు. డిసెంబర్, జనవరిలో దేశవ్యాప్తంగా బస్సు యాత్రలు, జీపు యాత్రలు, పాదయాత్రలు, సైకిల్ మోటార్ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజా వ్యతిరేక మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ ప్రచారం చేపట్టాలని కోరారు. ఇందులో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులతోపాటు ప్రజ లందరూ భాగస్వాములు కావాలనీ, విద్యావంతులు, మేధావులు ఈ పోరాటానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఏఐకేఎస్ అఖిల భారత సహాయ కార్యదర్శి టి సాగర్ మాట్లాడుతూ తెలంగాణలో ఈ డిమాండ్లతోపాటు కౌలు రైతులకు 2011 చట్టం ప్రకారం రుణార్హత కార్డులివ్వాలనీ, అర్హులైన పోడు రైతులందరికీ 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలివ్వాలనీ, పంటలు నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇవ్వడ ంతోపాటు రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ అఖిల భారత ఉపాధ్యక్షులు హన్నన్ మొల్ల, కోశాధికారి కృష్ణప్రసాద్, నాయకులు విప్లవ్ మజుందార్, అమోల్ హల్దార్ తదితరులు పాల్గొన్నారు.